‘కానిస్టేబుల్‌’గా వరుణ్‌ సందేశ్‌

Varun Sandesh as 'Constable'వరుణ్‌ సందేశ్‌ హీరోగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్‌ పతాకంపై బలగం జగదీష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్‌’. వరుణ్‌ సందేశ్‌కి జోడీగా మధులిక వారణాసి ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈచిత్రంలోని ‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ సి.వి.ఆనంద్‌ రిలీజ్‌ చేశారు. శ్రీనివాస్‌ తేజ సాహిత్యాన్ని అందించగా, సుభాష్‌ ఆనంద్‌ సంగీతాన్ని సమకూర్చారు. నల్గొండ గద్దర్‌ నర్సన్న ఆలపించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమీషనర్‌ సి.వి.ఆనంద్‌ మాట్లాడుతూ, ‘నేను ఆవిష్కరించిన ఈ టైటిల్‌ సాంగ్‌ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్‌ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్‌ ఈ పాట వింటారు’ అని అన్నారు. ‘నాకు మంచి కమ్‌ బ్యాక్‌ సినిమా అవుతుంది’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. నిర్మాత బలగం జగదీష్‌ మాట్లాడుతూ, ”కానిస్టేబుల్‌ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్‌తో ఈ సినిమాను నిర్మించాను. కానిస్టేబుల్స్‌ మీద నాకున్న గౌరవంతో ఈ పాటను నేనే దగ్గర ఉండి రాయించి, నల్గొండ గద్దర్‌ నరసన్నతో పాడించాను’ అని తెలిపారు. దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె.మాట్లాడుతూ, ‘మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్‌ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసింది’ అని అన్నారు.