– తొలి రోజు 77 ఓవర్ల ఆట వర్షార్పణం
– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 28/0
– భారత్, ఆసీస్ మూడో టెస్టు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న కీలక మూడో టెస్టులో వరుణుడు తన ఆట చూపించాడు!. భారత్, ఆస్ట్రేలియాలు గబ్బాలో గర్జించేందుకు సిద్ధమవగా వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. ఎడతెగని వర్షంతో తొలి రోజు ఆటలో 77 ఓవర్ల ఆట వర్షార్పణం అయ్యింది. ఇక ఈ టెస్టు మ్యాచ్‌లో చివరి నాలుగు రోజులు ఓ అర గంట ముందుగా ఆట ఆరంభం కానుంది.
నవతెలంగాణ-బ్రిస్బేన్
భారత్ వరుసగా మూడోసారి టాస్ నెగ్గింది. మేఘావృత వాతావరణం. పచ్చికతో కూడిన బ్రిస్బేన్ గబ్బా పిచ్. జశ్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌లు పచ్చికపై పేస్ పండుగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో వరుణుడు మైదానంలో రంగ ప్రవేశం చేశాడు. ఉదయం సెషన్లో తొలుత 5.3 ఓవర్ల తర్వాత వర్షంతో ఆట నిలిచిపోగా.. మళ్లీ 13.2 ఓవర్ల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి నుంచి ఇక మ్యాచ్ సాధ్యపడలేదు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (19 నాటౌట్, 47 బంతుల్లో 3 ఫోర్లు), నాథన్ మెక్‌స్వీనీ (4 నాటౌట్, 33 బంతుల్లో) 13.2 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వర్షం ఆరంభానికి ముందు సరైన లెంగ్త్ కోసం భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. కానీ విరామం తర్వాత మంచి లెంగ్త్‌లతో ఆసీస్ ఓపెనర్లను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. ఆసీస్ సీనియర్ ఉస్మాన్ ఖవాజా మూడు ఫోర్లతో జోరు మీద కనిపించాడు. నేడు ఉదయం మ్యాచ్ ఓ అర గంట ముందు ఆరంభం కానుండగా.. ప్రతి రోజు 98 ఓవర్ల ఆట సాగనుంది.
జడేజా, ఆకాశ్ ఇన్ : ఆడిలైడ్ టెస్టులో దారుణ పరాజయంతో టీమ్ ఇండియా తుది జట్టులో పలు మార్పులు చేసింది. స్పిన్, పేస్ విభాగంలో మార్పులు చేశారు. ఆడిలైడ్‌లో ఆడిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ స్థానంలో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో నిలుస్తాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి ఎంచుకున్నారు. పేస్ విభాగంలో యువ పేసర్ హర్షిత్ రానా స్థానంలో మరో యువ పేసర్ ఆకాశ్ దీప్ జట్టులో నిలిచాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వికెట్ల వేటలో సఫలమైన రికార్డు ఆకాశ్ దీప్ సొంతం. ఇక రవీంద్ర జడేజా తన విలక్షణ మాయజాలంతో పాటు బ్యాట్‌తోనూ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేయగల సమర్థుడు. బ్రిస్బేన్ టెస్టు ముంగిట ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ స్థానం!. పెర్త్ టెస్టులో విజయవంతమైన కెఎల్ రాహుల్ కోసం ఆడిలైడ్ టెస్టులో ఓపెనర్ స్థానాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ త్యాగం చేశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. గబ్బా టెస్టులో రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్‌గా వస్తాడని అనుకున్నప్పటికీ.. కెఎల్ రాహుల్‌కు కెప్టెన్ మరో అవకాశం అందించినట్టు కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ గబ్బా టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను మొదలెట్టనున్నారు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు టాప్-4లో బ్యాటింగ్ చేయనున్నారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : ఉస్మాన్ ఖవాజా నాటౌట్ 19, నాథన్ మెక్‌స్వీనీ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 6-3-8-0, మహ్మద్ సిరాజ్ 4-2-13-0, ఆకాశ్ దీప్ 3.2-2-2-0.