‘వాసాల’ వారింటి మరో బాల సాహితీకిరణం

'Vasala' is another ray of children's literatureవారసత్వం అనను కానీ ఇంటి వాతావరణం, ఉద్యోగం చేస్తున్న చోటు ప్రభావం… తల్లిదండ్రుల ఆసక్తులు, అభిరుచులు కొంత మేరకు పిల్లల పైన లేదా ఇతరులపైన ప్రభావం చూపకుండా ఉండలేవు. ఆగామి కాలంలో ఆ యిష్టాలు వ్యక్తులపైన బలమైన ముద్రలను వేస్తాయి. నడిపిస్తాయి. గుర్తింపుతో పాటు తీర్చిదిద్దుతాయి. అటువంటి ముచ్చటనే మనం చెప్పుకుందాం!
మన తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం అందుకున్న రెండవ వ్యక్తి వాసాల నరసయ్య గారు. మొదటి పురస్కారాన్ని సినీహీరో, రచయిత, ఉద్యమకారులు డా. భూపాల్‌ అందుకున్నారు. ఇప్పటికి తెలుగులో ఈ పురస్కారం పద్నాలుగు మంది అందుకున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… ఇవ్వాళ మనం పరిచయం చేసుకుంటున్న బాల సాహితీవేత్త, హిందీ-తెలుగు ద్విభాషా కవి, రచయిత, అనువాదకులు, సాహిత్య సంస్థ నిర్వాహకుడు డా. వాసాల వరప్రసాద్‌ శ్రీ వాసాల నరసయ్య – శ్రీమతి పద్మావతి దంపతుల కొడుకు. వృత్తిరీత్యా జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలలో హిందీ అసోసియెట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వాసాల వరప్రసాద్‌ మే 5, 1977న పెద్దపల్లిలో పుట్టాడు. ఈయనే కాదు ఈ వాసాల వారింట్లో మరో ఇద్దరు రచయితలు కనిపిస్తారు. వారిలో మరో బాల సాహితీవేత్త కూడా ఉన్నాడు, అయన గురించి తరువాత తెలుసుకుందాం!
డా. వాసాల వరప్రసాద్‌ ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, జూనియర్‌ లెక్చరర్‌ నుండి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు. రచయితగా హిందీ తెలుగు భాషల్లో రచనలు, అనువాదాలు చేసే వరప్రసాద్‌ అనుమాండ్ల శంకరయ్య తెలుగులో రచించిన ‘శ్రీ శబరీమాతా గురు చరిత్ర’ పుస్తకాన్ని ‘శ్రీ శబరీమాతా గురు చరిత్ర’గా హిందీలోకి తెచ్చారు. కవిత్వం, కథల వంటివాటిని అనువాదాలు చేశారు. దక్షణ భారత హిందీ ప్రచారసభ వారి ‘వివరణ్‌ పత్రిక’, ‘స్రవంతి’ పత్రికల కోసం పరిశోధనా వ్యాసాలు రాశారు. 2021లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2017లో హిందీ భాషా బోధనలో ఉత్తమ పురస్కారం తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుండి అందుకున్నారు. కళాశాల జాతీయ సేవా పథకంతో పాటు ఇతర సంస్థలు, కార్యక్రమాలలో ముందు నిలిచే వరప్రసాద్‌ తండ్రి వాసాల నరసయ్య స్థాపించిన వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారాల కమిటి కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు. త్రివేణి సాహితీ సంస్థ అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్‌ ఉపాధ్యక్షులు, కరీంనగర్‌ పద్మావతి హిందీ ప్రచార సభ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. రచయితగానే కాక వాసాల నరసయ్య గారి పలు పుస్తకాలకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు. నవచేతన తెచ్చిన ‘ప్రతిజ్ఞ-పట్టుదల, ఇతర బాలల కథలు’, రాఘవేంద్ర వారు వేసిన ‘వాసాల నరసయ్య బాల గేయ సుమమాల’, అమరావతి వారు ప్రచురించిన ‘చిట్టి కథలు’ అందులో కొన్ని.
కవిగా, రచయితగా, అనువాదకునిగా వరప్రసాద్‌ తండ్రి బాటలో తొలుత బాల సాహిత్యం వైపుకు చూసి, రచనలు చేసినా తరువాత ఎందుకో దానిని అంతగా చేపట్టలేదనిపిస్తుంది. గేయాలు, కథలు రాస్తున్నా వాటిని పుస్తకంగా తేలేదు మరి. ఈ కోవలో పోస్ట్‌ మాస్టర్‌ అయిన తండ్రి వాసాల వారిని బాల్యం నుండి ప్రతిరోజు గమనించిన వర ప్రసాద్‌ బాల సాహిత్య సృజన కారునిగా తన తొలి సంతకాన్ని పోస్ట్‌ నేపథ్యంగా వున్న రచనతోనే చేయడం విశేషం. వరప్రసాద్‌ రచించిన పుస్తకం పేరు ‘కార్డులు-కబుర్లు’. ఈ పేరుతోనే ఇందులో వున్న విషయాలు, అంశాలు మనకు పరిచయం అవుతాయి. కొన్ని విషయాలు, విశేషాలు అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది కానీ చదువుతున్నప్పుడు ఇందులో ఇంత విశేషం వుందా! దీనిలోని మతలబు ఇదా! అని అనిపిస్తుంది. ఈ బుజ్జి వయ్యి కూడా అటువంటిదే సుమా! పోస్టుకార్డులు, వాటి కథ మొదలుకుని నిత్య జీవితంలో మనం వాడే దాదాపు అన్నిరకాల కార్డుల గురించి బాలల కోసం చక్కగా వివరించారు. దాదాపు అరవైపుటల ఈ పుస్తకంలో ‘పోస్టు కార్డులు, ఫారిన్‌ కార్డులు, ఇన్‌లాండ్‌ లెటర్లు, బిజినెస్‌ రిప్లైకార్డులు, గ్రీటింగ్‌ కార్డులు, బ్యాంక్‌ కార్డులు, ఐడెంటిటీ కార్డులతో పాటు ఇతర కార్డుల గురించిన పరిచయాలు ఇందులో మనకు కనిపిస్తాయి.
మొదటగా ‘కార్డు’ అన్న ఆంగ్ల పదానికున్న అర్థాన్ని చెప్పిన రచయిత, తరువాత ఇవ్వాళ్ళ విరివిగా వాడుతున్న పోస్టుకార్డు ఎలా వచ్చిందో చెబుతాడు. ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో హర్‌మన్‌ అనే ఒక ప్రొఫెసర్‌ ఉండేవాడట. విషయం రాసి దానిని పోస్టుచెయ్యాలన్నా ఎక్కువ డబ్బు ఖర్చుకావడంతో తన బాధను వెళ్ళగక్కుతూ పత్రికలో ఒక వ్యాసం రాశాడట. ఆ వ్యాసం అప్పటి ఆస్ట్రియా పోస్టు మాస్టర్‌ జనరల్‌ డా.బన్‌మైలీకి నచ్చడంతో ఆయన తక్కువ ధరలో ఉండే పోస్ట్‌కార్డును ప్రవేశపెట్టాడట. అలా 1869లో తొలి పోస్టుకార్డు పుట్టిందన్నమాట. అంటే అచ్చంగా నూటా యాభైఅయిదేండ్లు మన పోస్టుకార్డు వయసు. ఇంకా స్వాతంత్య్రం వచ్చాక అవి మన దేశంలో ఎలా వ్యాప్తి చెందాయో, గాంధీతాత వాటిని ఎలా వాడేవాడో వంటి విషయాల వరకు ఇందులో ఉన్నాయి. ఇంకా మనకు తెలియని కార్డుల ధరలు, సైజులు ఇట్లా ఒకటా రెండా వందకు పైగా వివిధ రకాల విషయాల అన్ని రకాల కార్డుల గురించి ఉన్నాయి. అయితే రచయిత ఇవి రాసినప్పుడు సిమ్‌కార్డులు, మైక్రోచిప్పులవంటివి లేవు కాబట్టి ఇందులో అవి మనకు కనిపించవు. మరి మనకోసం డా. వరప్రసాద్‌ నేటి కార్డుల కథ రాస్తాడని ఆశిద్దాం! జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548