విస్తారి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది

Vastari is small and Veeramma's hand is bigవిశాలమైన ఆలోచనలు ఉన్నవారి గుణాలు విశాలంగానే ఉంటాయి. కొందరికి ఆతిథ్యం ఇవ్వడంలో ఎనలేని సంతృప్తి ఉంటుంది. వాళ్లు ఏదో వడ్డించాలన్నట్టు వడ్డించరు. వేసుకోండి వేసుకోండి అని మరీ పళ్లెంలో తినే పదార్థాలు వేస్తారు. వాళ్ల చేయి గుణమే అట్లా అంటూ ‘ఆమె చేయి పెద్దది’ అని ముచ్చటిస్తరు. అందుకే ‘విస్తారి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది’ అనే సామెత పుట్టింది. వీరమ్మ అన్ని కూరలు విస్తారంగా వేస్తది అన్నం చాలా పెడతది. కానీ విస్తారి మాత్రం చిన్నగా అయింది. అయితే కొందరి చేతులు పెట్టేతందుకు ఇచ్చేందుకు రానే రావు. పిసినాసి వాళ్ళు చాలా మందే ఉంటరు కదా. ఇటువంటి వాళ్ళ పనులు కూడా అట్లే ఉంటాయి . ఏదైనా పని చెప్తే దీర్ఘాలు తీస్తారు. ఇప్పుడు కాదు అని ఆలోచిస్తరు. ‘విస్తార్లు తీయమంటే తిన్నోళ్ళు ఎందరని లెక్క చేసినట్టు’ పనికి ఎదురు ప్రశ్న వేస్తారు. అసలైతే విస్తార్లు లెక్కపెడితే అసలు తిన్నది ఎందరో తెలుస్తది. ఇక్కడ ఉల్టా ఆలోచన ఉంటది.
ఇలాంటి గుణమే కాకుండా చేసిన మేలు మరిచిపోయే కృతఘ్నతా భావం ఉన్న వాళ్లకు కూడా ఒక సామెత ఉన్నది. ‘నడి ఇస్తారిల తిని కొన ఇస్తారి ఖరాబు చేసేటోడు’ అంటారు. అంటే అక్కడిది అక్కడనే పెట్టినవాన్ని మర్చిపోయె వాడు అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఒకరి వెనుక ఒకరు అనుసరిస్తూనే ఉంటారు. మంచి వాళ్ళ వెంబడి మంచివాళ్లు, చెడ్డ వాళ్ల వెంబడి చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళ కోసం ఒక సామెత ఉన్నది. ‘విస్తారి వెంబడి దొప్ప’ అంటారు. అంటే పెద్దాయన వెనుక చిన్నాయన అన్నట్టు. పేరు విస్తారిదే, దానికి అవసరమైనది అనుసరించేది దొప్ప. దొప్ప అనగా మోతుకు ఆకుతో చారు పోసేందుకు చేసిన గిన్నె లాంటిది. విస్తారి అంటే అన్నం తినే పళ్లెం లాంటిది.

– అన్నవరం దేవేందర్‌, 9440763479