తెలుగుభాషాసాహిత్య సంస్కతి సంరక్షణకూ, సంవద్ధికీ మహత్తరమైన సేవచేసిన ప్రచురణ సంస్థల్లో వావిళ్ల ప్రెస్ తలమానికమైనది. 1854లో మద్రాసులో వావిళ్ల రామస్వామిశాస్త్రి స్థాపించిన ఆదిసరస్వతీనిలయ ముద్రణాలయం 1906లో వావిళ్ల రామస్వామిశాస్త్రి అండ్ సన్స్ గాను, 1918లో వావిళ్ల ప్రెస్ గానూ నామాంతరంచెంది, 2000 ప్రాంతంలో హైదరాబాద్ మహానగరానికి తరలివచ్చి కనిపించని అందాలు, వినిపించని రాగాలుగా తెలుగు సాహిత్య ప్రియులకు హదయాహ్లాదకరంగా పాటుపడుతుంది. 170 ఏళ్లుగా అనవరతసేన చేస్తున్న ఈ చదువులతల్లి ఆటపట్టు పుట్టుపూర్వోత్తరాల్ని తవ్వి తీసి, కుప్పపోసి ఒప్పులకుప్పగా ‘వావిళ్ల సాహితీ వికాసం వావిళ్ల నుంచి వావిళ్ల దాకా…’ అన్న బహత్ పరిశోధన గ్రంథాన్ని తీర్చిదిద్దిన పరిశ్రమ డా. వి.వి. వెంకటరమణగారిది.
వావిళ్ల రామస్వామిశాస్త్రి, ఆయన సుపుత్రులు శ్రీ వేంకటేశ్వరశాస్త్రి, తర్వాతి వారసులు సంస్కతం, తెలుగు, తమిళం, కన్నడభాషల్లోనూ, ఇంగ్లీషుభాషలో కూడా విలువైన గ్రంథాల్ని ప్రచురించిన, చరిత్రను వివరించిన అమూల్య రచన. ‘వావిళ్ల వైభవమ్’ అన్న ముందుమాటలో ”ఆధునిక భారతీయ సారస్వత జగత్తులో గీతాప్రెస్, గోరఖ్ పూర్ వారిని మినహాయిస్తే, ప్రచురణరంగంలో ఇంత భాషాసేవ గావించిన వ్యక్తులు శ్రీ వావిళ్ల వారు మాత్రమేనేమో!” – అన్న డా.పి. రమేష్ నారాయణ అభిప్రాయం గమనించదగ్గది.
679 పేజీల ఈ గ్రంథం వావిళ్ల వారి అసాధారణమైన సంస్కతాంధ్ర సాహితీసేవ పరువును పరిపరివిధాల పెంచే బరువైన రచన. ఈ పుస్తకంలో 11 అధ్యాయాలూ, ఒక అనుబంధం ఉన్నాయి. ఇవన్నీ ఎంతో విలువైన, ఈ తరానికీ, అంతకుముందు తరానికీ తెలియని సమాచారాన్ని అందించేవే.
‘ముద్రణారంగం తొలిరోజులు’లో, డా|| వి.వి.వి.రమణ, ప్రపంచంలో ముద్రణ తొలిరోజుల్ని, భారతదేశంలో అచ్చు ప్రారంభమైన దినాల్ని వివరించారు. ‘నాటి ముద్రణారంగం’లో, భారతదేశంలో ఆంగ్లేయులు స్థాపించిన అచ్చుకూటాలు, మద్రాసులో స్థానీయులు నెలకొల్పిన ముద్రణాలయాల చరిత్రను వెల్లడించారు. ‘పుదూరు ద్రావిడులు- ముద్రణారంగం: 1836లో వజ్జల సీతారామశాస్త్రి మద్రాసులో సరస్వతీ అచ్చుకూటం స్థాపిస్తే పురాణం హయగ్రీవశాస్త్రి, వేదం వేంకటాచలశాస్త్రి ప్రభతులు వెరసి 16 ముద్రణాలయాల్ని నడిపిన ఘనులు.
‘ముద్రణారంగంలో వావిళ్ల రామస్వామిశాస్త్రి, వేంకటేశ్వరశాస్త్రి సి.పి.బ్రౌన్ పాఠపరిష్కరణా విధానం ప్రకారమే తెలుగు కావ్య పరిష్కరణలు చేసి, పండితులతో చేయించారు. వావిళ్ల అనంతనారాయణశాస్త్రి, రామస్వామిశాస్త్రి సోదరులు మేనమామ వేదం వెంకటాచలశాస్త్రితో కలిసి 1847లో మద్రాసు నగరంలో ‘వివేకరత్నాకరము’ అనే ముద్రణశాలను స్థాపించారు. ఈ సంస్థ ‘వాల్మీకి రామాయణా’న్ని నాలుగు సంపుటాలుగా వెలువరించింది. పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్ని 1848లో ప్రచురించింది. సరస్వతీనిలయ ముద్రాక్షరశాల 1857లో సింగళిసూరన ‘రాఘవ పాండవీయాన్ని, 1859లో కాకునూరి అప్పకవి రాసిన ‘అప్పకవీయము’ను ప్రచురించింది. 1868లో ‘మనుచరిత్ర, 1869లో ‘ఆముక్తమాల్యద’, 1870లో ‘ఆంధ్రమహాభారతము’ వెలువడ్డాయి. గురజాడ శ్రీరామమూర్తిగారి ‘కవిజీవితములు’ 1886లో వెలుగుచూసింది. కాలక్రమంలో ఈ సంస్థ రూపాంతరాలుచెంది వావిళ్ల ప్రెస్’గా కీర్తి గడించింది. వావిళ్ల సంస్థ తెలుగు, సంస్కతభాషల్లోనూ, తమిళం, కన్నడం, ఇంగ్లీషుఖాషల్లోనూ వేయికి పైగా పుస్తకాలు ప్రచురించింది.
‘వావిళ్ల వారి పత్రికలు’ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి 1914 జనవరిలో ‘త్రిలిజ్ఞ’ అనే మాసపత్రికను ప్రారంభించారు. ప్రసిద్ధ విద్వాంసులు అక్కిరాజు ఉమాకాంతం ఈ పత్రిక తొలి సంపాదకులు. ఇది పక్ష, వారపత్రికగా కూడా కొంతకాలం వెలువడింది. 22 ఏళ్లకు పైగా వారపత్రికగా పాఠకుల మన్ననలు పొందగలిగింది.
వావిళ్లవారు 1918లో ‘బాలవినోదిని’ అనే తమిళ మాసపత్రికను వెలువరించారు. 15 ఏళ్లపాటు వెలువడ్డ ఈ పత్రికకు మహాకవి సుబ్రహ్మణ్యభారతి మూడేళ్లపాటు సంపాదకత్వం నిర్వహించారు.
ప్రాచీన తెలుగు సాహిత్యానికే కాదు, ఆధునికాంధ్ర సాహిత్యానికి కూడా వావిళ్లవారు చేసిన సేవ అధ్వితీయమైనది, అమోఘమైనదీనూ. ఈ సంస్థ ప్రచురించిన ప్రాచీన తెలుగు కావ్యాలు చక్కగా పరిష్కతమై పరిశీలనాత్మకమైన ప్రబుద్ధ పీఠికలతో వెలువడేవి. ఈ కారణంగా కావ్యాలకు పాఠకుల ఆదరణ లభించింది. కొమ్ములు తిరిగిన సహదయ విద్యాంసులు రాసిన విమర్శనా గ్రంథాలు ఆ కావ్యాల సౌందర్యానికి మెరుగులు దిద్దాయి. వజ్జల చిన సీతారామశాస్త్రి ‘వసుచరిత్ర- విమర్శనము, జనమంచి శేషాద్రిశర్మగారి మనుచరిత్ర హదయావిష్కరణము, కట్టమంచి రామలింగారెడ్డి గారు ‘కళాపూర్ణోదయము’ ప్రబంధానికి రాసిన పీఠిక, బండారు తమ్మయ్యగారు ‘క్రీడాభిరామము’, ‘బసవపురాణము’లకు రాసిన పాండిత్యపూర్ణమైన విపుల పీఠికలు ఆయా కావ్యాల అధ్యయనానికి ఎంతగానో దోహద మొనర్చాయి. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ‘మనుచరిత్ర పీఠిక, హంసవింశతి’కి మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి లోతైన పీఠిక- ఇది మచ్చుతునకలే కాదు, మెచ్చు తునకలుకూడా. వావిళ్ల వారు ఎన్నో కావ్యాలకు, ప్రబంధాలకు విద్యాంసులచేత టీక, వ్యాఖ్యానాలు రాయించి, వాటికి విశాల పాఠక ప్రపంచాన్ని సంతరించిపెట్టారు. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠ్యభాగాలైన తెలుగు కావ్య ప్రబంధ, శతకాలకు పండితప్రవరులచేత సరళమైన, రసవంతమైన వ్యాఖ్యానాలు రాయింపజేసి ఆ రచనలకు బహుళ ప్రచారం కలిగింప చేశారు. ‘రంగనాథ రామాయణము పండితారాధ్య చరిత్ర’, ‘బసవపురాణము’ గౌరన హరిశ్చంద్ర చరిత్ర’ మొదలైన ద్విపద కావ్యాలు ప్రచురించి రసహదయుల్ని వాటివైపు ఆకర్షింపజేశారు వావిళ్లవారు. ‘భోజకాళిదాస కథలు’, ‘తాతాచార్యుల కథలు’, ‘మర్యాదరామన్న కథలు’, ‘పరమానందయ్య కథలు’, ‘రేచుక్క పగటిచుక్క కథలు’, ‘చార్ దర్వేష్ కథలు’ మొదలైన ఆసక్తికరమైన, కుతూహలం పెంపొందించే కథా సంపుటాలు ప్రచురించి పాఠక సముదాయాన్ని పదింతలు చేసిందీ సంస్థ. ప్రౌఢ సాహిత్య రచనలతోపాటు పామరరంజకమైన సాహిత్యంపట్ల కూడా సమదర్శిత్వాన్ని ప్రదర్శించింది. బాల సాహిత్యాన్ని సష్టింపజేసి ఆబాలగోపాలానికి మహదానందం కలిగించడంలో వావిళ్ల ప్రెస్ వహించిన పాత్ర గణనీయమైంది. పుదూరు సీతారామశాస్త్రి 1832 ప్రాంతంలో బాలబాలికలకు మనోల్లాసంతోబాటు మనోవికాసం కలిగించే ‘బాలశిక్ష’ను రూపొందిస్తే, వావిళ్ల ప్రెస్ 1916లో ‘పెద్దబాలశిక్షను ప్రచురించి పేరు ప్రసిద్ధులు పొందింది. మద్రాసులోని ఇతర ముద్రణశాలలు కూడ ఆస్థాన విద్వాంసులచే ‘బాలశిక్ష’లు, ‘పెద్దబాలశిక్ష’లు రాయించి గంట్లు మూట కట్టుకొన్నారు.
వావిళ్ల ప్రెస్ సంస్కత, తెలుగు భాషల్లోని కావ్య నాటక, లాక్షణిక, నానాశాస్త్ర గ్రంథాల్ని వ్యాఖ్యాన సహితంగా వెలువరించి పండిత, పామర జనాలకి జ్ఞానభిక్ష పెట్టింది. వావిళ్ల రామస్వామిశాస్త్రి, వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి గారలు మహాపండితులకు తణమో, పణమో ఇచ్చి వాళ్ల చేత పాఠ పరిష్కరణ, పీఠికారచన, ముద్రారాక్షస పరిహారం చేయించడంతోపాటు ముద్రణ, బైండింగ్, పంపిణీల విషయంలో తీసుకొన్న శ్రద్ధాసక్తులు అనితరసాధ్యం. వావిళ్ల ప్రెస్‌లో 1970 దాకా పుస్తకాల అమ్మకానికి ముందు ప్రతి పుస్తకం, ప్రతి పేజీ సరిగ్గా అచ్చయిందా లేదా, పుటలు తారుమారైనాయా, మడతలు పడ్డాయా, మధ్యలో తెల్లకాగితాలొచ్చాయా ఇవన్నీ సరిచూసిన తర్వాతే విక్రయానికి పంపేవారు.
‘వావిళ్ల వారి బహుముఖ సేవ’లో వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారి నానాముఖ సేవ వివరంగా చెప్పబడింది. ‘వావిళ్ల వివిధ’లో వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారు శంగార కావ్యాల ముద్రణకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని 15 ఏళ్లపాటు తన్నుకులాడిన సంగతులు వివరింపబడ్డాయి. వివిధ ప్రాంతాల్లో శాస్త్రిగారికి జరిగిన సన్మాన సమాచారం కూర్చబడింది. 1955 డిశంబరు 3వతేదిన విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ పట్టా ఇచ్చి గౌరవించింది. శాస్త్రిగారికి పలుచోట్ల సన్మానాలు, అభినందన సభలు జరిగాయి. ‘వావిళ్ల తర్వాత’లో వేంకటేశ్వరశాస్త్రిగారు చెన్నపట్టణంలోనే 1956 ఫిబ్రవరి 9వతేదీన మరణించిన తర్వాతి విషయాలు క్రోడీకరింపబడ్డాయి. వావిళ్ల ట్రస్టు నియమించి ముద్రణాలయం ఆశయాల్ని, ఆచరణల్ని స్పష్టంగా ప్రకటించారు. ‘ప్రత్యేక సంపుటాలు’లో శాస్త్రులవారి షష్టిపూర్తి, శతజయంతి, వావిళ్ల 150 వసంతాల సంచికల గురించి విశదంగా చెప్పబడింది. ‘వావిళ్ల పునర్వైభవం’లో వావిళ్ల సంస్థ హైదరాబాదుకు మకాం మార్చడం, అక్కడినుంచే కొన్ని పాత పుస్తకాల పునర్ముణ, కొత్త పుస్తకాల ప్రకాశనం చేస్తున్న వివరాలు పొందుపర్చబడ్డాయి.
ఇంత భారీ గ్రంథం రాసి గ్రంథకర్త సాధించి, మనకిచ్చిన పాథేయమేమిటి? అన్న ప్రశ్న కలుగుతుంది. మరుపూరు కోదండరామి రెడ్డి, పునుగు శంకరశాస్త్రి, బులుసు వెంకటరమణయ్య, వజ్జల వేంకట సుబ్రహ్మణ్య శర్మ మొదలైన పండితుల విలువైన పుస్తకాలు, ఇంకా మరెన్నో గ్రంథాలు, పత్రికలు చదివి గ్రంథకర్త తన పరిశోధనాంశాల్నీ జోడించి ఈ గ్రంథరాజాన్ని వెలువరించారు. వావిళ్ల సంస్థ 170 ఏళ్లనాడు ప్రచురించిన గ్రంథాల ముఖపత్రాలు, ప్రకాశకుల విన్నపాలు, ఘనపాఠీల పీఠికాభిప్రాయాలు సమకూర్చి పెట్టారు. పైగా ఎంతోమంది మహనీయుల ఫోటోలు ప్రచురించారు. వావిళ్ల సంస్థ ప్రారంభకాలం గురించి సవరణ చేశారు. వావిళ్ల సంస్థ బహుముఖీన సేవ గురించి పరిశోధన చేయడానికి తలుపులు తెరిచి విద్వాంసుల్ని ఆహ్వానించారు డా.వి.వి. వేంకటరమణ.
శ్రీ ఘట్టమరాజు, 9984082078