ఉస్మానియా విశ్వవిద్యాలయ నూతన సంవత్సర క్యాలండర్, డైరీ, ఇన్ఫర్మాటికా ను వీసీ ప్రొ. కుమార్ మొలుగరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సరికొత్త ఉత్సాహం, ఉత్తేజంతో రానున్న రోజుల్లో ఉస్మానియా కుటుంబ సభ్యులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రొ. కుమార్ ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరి కుటుంబంలో నూతన ఏడాది వెలుగులు తీసుకురావాలని అన్నారు. 2025లో ఓయూకు ఉత్తమ గుర్తింపు దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు పనిచేద్దామని పిలుపునిచ్చారు. గత పది పన్నెండేళ్లలో ఓయూ క్యాలెండర్, డైరీలను ఈ దఫా జనవరి ఒకటో తేదీనే ఆవిష్కరించటం పట్ల ప్రొ. కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం రెండు నెలల ముందు నుంచే డైరీ, క్యాలండర్ కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించి కూర్పు చేసిన సిబ్బందిని అభినందించారు. ఓయూ క్యాలెండర్, డైరీ, ఇన్ఫర్మాటికా ఓయూ ప్రెస్ లో రేపటి నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మూడో తేదీ నాటికి ఆయా విభాగాలకు అందుబాటులోకి వస్తాయి. ఉన్నతాధికారులు, అధ్యాపకులు, ప్రైవేటు కళాశాలల వివరాలు సహా ఓయూ సమగ్ర సమాచారంతో కూర్పు చేసిన డైరీ, ఇన్ఫర్మాటికాతో పాటు క్యాలండెర్లను ఓయూ అనుబంధ, స్వయం ప్రతిపత్తి, గుర్తింపు పొందిన సంస్థలు వినియోగించుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం ఓయూ ప్రెస్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొ. జితేంద్రనాయక్, విశ్రాంత ఆచార్యులు ప్రొ.కె. స్టీవెన్ సన్, ప్రెస్ డైరెక్టర్ ప్రొ. వి. రమేష్ కుమార్, యూజీసీ డీన్ ప్రొ. లావణ్య, ప్రొ. శ్రీనగేష్, ప్రొ. రాజేంద్ర నాయక్, ప్రొ. శశికాంత్, ప్రొ. శ్రీనివాసులు, ప్రొ. ప్యాట్రీక్, జాయింట్ రిజిస్ట్రార్ ఎం. శ్రీనివాస్ అధ్యాపకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గత సంవత్సరం విక్రయించిన ధరలకే వీటిని విక్రయించనున్నట్లు డెరైక్టర్ ప్రో.రమేష్ కుమార్ పేర్కొన్నారు. వీసీ ప్రత్యేక చొరవతో ఇలా సకాలం లో విడుదల చేసిననట్లు చెప్పారు.