విడిసి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము

– పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ కంటేశ్వర్: నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాటు మండలాలలో, గ్రామాభివృద్ది కమిటీల చట్టవ్యతిరేక కార్యకలాపాల పై గల కేసులు అరెస్టు అయిన వారి వివరాలు తెలియజేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ గురువారం వెల్లడించారు.2022 సంవత్సరంలో 12 కేసులు 119 మంది అరెస్ట్ , 2023 సంవత్సరంలో 11 కేసులు 163 మంది అరెస్ట్,2024 వ సంవత్సరంలో 05 కేసులు 75 మంది అరెస్ట్ చేయడం జరిగిందని మొత్తంగా 28 కేసులు 357 మంది అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల నుండి కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ది కమిటీల పేరుతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామాభి- వృద్ది అవసరాలకు ప్రభుత్వం నుండి సహయం పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ది కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు.
కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ది కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహసంబంధ తగాదాలు, అన్నదమ్ముల పంచాయితీలు, భార్యభర్తల వివాదాలలో తలదూర్చీ, పంచాయితీలలో దడవాతు (అడ్వాన్సు) తీసుకొని వారికి నచ్చిన విధంగా తీర్మానించి, చట్టం చేయవలసిన పనిని వారి చేతులోనికి తీసుకొని, వాళ్ళను పోలీస్ స్టేషన్ ను, న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలలు తాము చెప్పినవిధంగా విననియెడల పెద్దమొత్తంలో దండుగా (జరిమానా ) వేసి మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని భయబ్రాంతులకు గురిచేసి, గ్రామాభివృద్ది కమిటి పేరుతో గ్రామంలో బెల్టు షాపులు, కూల్డ్రింక్ షాపులు, కిరాణ షాపు మరియు కోడి గ్రుడ్డు ధర పై యాక్షన్ (వేలం వేయడం ) వేయడంలో ఎవరు ఎక్కువధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమముగా పెట్టి డబ్బులు వసూళ్ళు చేస్తున్నారు. భారత రాజ్యాంగము కల్పించిన ఏ వృత్తియైన చేపట్టే ప్రాధమిక హక్కును ప్రతీ భారత పౌరునికి కల్పించింది. అలాగే పి సి ఆర్ యాక్ట్ 1955 (పౌర హక్కుల చట్టం 1955) ప్రకారంగా అనుసరించి పౌరుల కులం, మతంపరంగా కాని లేదా మరి ఏ విధంగానైనా కాని పౌరుల మద్యన పక్షపాతదోరని మరియు పౌరులను వర్గ మరియు కులపరంగా బహిష్కరించరాదు. రాష్ట్ర హైకోర్టు కూడా గ్రామాభి వృద్ది కమిటీలు నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కూడా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. అలాగే జిల్లా న్యాయసేవా సంస్థ, గ్రామాభివృద్ది కమిటిల చట్టవ్యతిరేక కార్యకలాపాలు గురించి గ్రామాలలో అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా గ్రామాభివృద్ది కమిటీలు వారి పద్దతి మార్చుకోవడం లేదు. వారి చర్యల వలనుప్రజల హక్కులకు భంగము కల్పిస్తున్నాయి. ప్రజలకు సామాజికంగా వేరుచేయడమే కాకుండా ప్రజలకు జరిమానాలను వేస్తు ఆర్ధికముగా నష్టం చేస్తున్నారు. భారత దేశంలో నివసించే ఏ వ్యక్తి అయిన భారత ప్రభుత్వం చట్టాలను గౌరవించి , ఆ చట్టాలకు లోబడే తమ కార్యకలాపాలు నిర్వహించాలి.
ఎవ్వరికైన ఎలాంటి సమస్యలు వచ్చిన సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుండి సహయసహకారాలు పొందాలి. కాని గ్రామాభివృద్ది కమిటి వారు వాళ్లు చెప్పిందే శాసనం అని, చట్టం అని చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఎవ్వరికైనా ఈ గ్రామాభివృద్ది కమిటిల వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించగలరు. కావున భవిష్యత్తులో ఎవ్వరయిని ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరిత్య కఠినమైన చర్యలు తీసుకోబడును, ఎవ్వరిని కూడా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించనైనది. ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ యందు సరియైన సమాధానం దొరకనట్లయితే తదుపరి అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ లేదా కమీషనర్ ఆఫ్ పోలీస్ లను సంప్రదించగలరు అని తెలియజేశారు.