వీర తెంగాణ విప్లవ గాథలు

Veera Tengana revolutionary storiesవిలేఖించనిండు నన్ను
తెలంగాణ వీరగాథ!
వ్యథలతోడ నిడిననూ
వ్యాకుల త్యాగాలతోడ
పెల్లుబికే ఆశాలత
పల్లవించు పరమగాధ
అమాయకుల హత్యలతో
సతుల మానభంగాలతో
బరువు తాళలేని జనత
తిరిగి చిందునెత్తురుతో
తడిసిన ఈ అమరగాధ
తడయక ప్రకటించు నొకటి
ఇది అంతిమ పోరాటం
ఇది సంకుల సంగ్రామం
వలస రాజ్య విధానాలు
ప్రజ ఇంక సహించబోదు
ఫాసిస్టుల అత్యాశలు
ఈషాణ్మాత్రము సాగవు
మరఫిరంగి నోళ్లతో
మదించుగడ్డు సామ్రాజ్యం
కూలికి తెచ్చిన బాంబులు
కురిపించే హానివాన
ఇంకానా? అసంభవం
ఇది అంతిమ పోరాటం
విన్నారోఝ వినలేదో?
వీర తెలంగాణా వీణ!
ప్రపంచమ్ము ఇదివిన్నది
పరమాశ్చర్యం! అన్నది
పరిష్కృతమ్ము చెందినట్టి
చరిత్రకిది మారుపేరు
విలువలు సరిదిద్దితీర్చి
పేర్చిన ఇతిహాసమిదే
మ్రోగెను ఇది మార్మ్రోగెను
రాగల కాలమ్ములోని
చీకటి వాకిళ్లనిండి
ఆ కడపల నధిగమించి
చారిత్రక తర్కమింక
సాగును తన పెను సిద్ధికి
అచ్చంపేటా నీవొక
అసామాన్య కుగ్రామము
తెలంగాణా పల్లెలన్ని
మిళితమాయె నీలోనే
నీ గ్రామపు సంగ్రామము
నిజముగ ఏకాకికాదు
కొరియాలో మలయాలో
కొకరకాని వియత్నామున
బర్మా ఇండోనేషియ
పల్లెలు నీ చెల్లెళ్లు!
ఈ సంగతి నీకు తెలుసు
నీ సమరము జగతి కెరుక!
ఉరు వీరుని దేహములో
హృదయము స్పందించునట్లు
అమరజీవి ధమనులలో
విమల రక్త ముడుకునట్లు
సమరశీలి నాసికలో
శ్వాసలు ప్రసరించునట్లు
హే! సాధారణ గ్రామమూర్తి
ఇతిహాసపు పుటలలోన
స్పందించుము జ్వలియించుము
ప్రసరించుము వర్ధిల్లుము!
మహిత తెలంగాణమందు
విహితమైన రణ శిబిరమ!
భావి మహా శిబిరాలకు
నీవేలే జనయిత్రివి!
ఈ రైతులు గతమందున
కౄరవిధిని విశ్వసించి
తరతరాల మత్తు మతం
తమకేదో మైక మొసగ
కొడవలి కోసేటప్పుడు
నడుము వంచు పైరులాగ
తలవంచిరి తత్త్వానికి
బలిపశువులుగా మారిరి
బానిసవృత్తికి మనస్సు
హీనంగా కట్టువడెను
బ్రతుకేందుకు లేదు శక్తి
నిట్టూర్చుట కైనచూడు
నిస్సత్తువ అడ్డమొచ్చు
ధైర్యంపోయిన కళ్లకు
సూర్యుడు ఎర్రని గాయం
శశి కూడా ఈ దృష్టికి
రసికారే పెద్దపుండు
అద్దమరేతిరిమింటను
అలరారే ఆ చుక్కలు
పగలంతా తమ వీపుల
దిగజారే చెమటబొట్టు
తరలిన ప్రతి ఒక్క ప్రొద్దు
మరణానికి మైలురాయి
క్రుంగుతున్న ప్రతిప్రొద్దూ
కౄరవిదికి సరిహద్దు
కామందులు ఎరువిచ్చిన
కత్తీ గునపం కొడవలి
చేతపట్టి అలసినట్టి
జీవికి మలిసంజె ముక్తి
కామందుల కంటి చూపు
కత్తికన్న మహాపదును
ఇరవైనాలుగు గంటలు
కొరడా దెబ్బల కోసం
వంగిన ఈ వీపులపై
పడిగ పడును మెరుపుదెబ్బ
ఈ మనుగడ రాతిదిబ్బ
ఇదంతా గతం! గతం!

ఇంగ్లీషు మూలం : హరీంధ్రనాథ్‌ చటోపాధ్యాయ
ఆంధ్రీకరణ : ఆరుద్ర