గవర్నమెంట్‌ టీచర్స్‌ జేఏసీ చైర్మెన్‌గా వీరాచారి

Veerachari as the Chairman of Government Teachers JACనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోకల్‌ క్యాడర్‌ గవర్నమెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎల్సీజీటీఏ), గవర్నమెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ సంఘాలు కలిసి గవర్నమెంట్‌ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జీటీజేఏసీ)గా ఏర్పడ్డాయి. గురువారం హైదరా బాద్‌లో జీటీజేఏసీ నూతన కమిటీని ఎన్నుకు న్నారు. చైర్మెన్‌గా మామిడోజు వీరాచారి, కోచైర్మెన్‌గా బైండ్ల నరసింహ, ఎం నళిని, కన్వీనర్‌గా డి గిరివర్ధన్‌, కోకన్వీనర్‌గా కర్ణకోట శ్రీనివాస్‌గౌడ్‌, సెక్రెటరీ జనరల్‌గా మేకల లక్ష్మీకాంతరెడ్డి, మహిళా కార్యదర్శిగా కోట సుకన్య, గౌరవ సలహాదారులుగా కె యాదగిరి, కె దశరథ్‌, సానా సురేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జీటీజేఏసీ చైర్మెన్‌ ఎం వీరాచారి తీర్మానాలను విడుదల చేశారు. ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయులకే విద్యాశాఖలోని అన్ని పదోన్నతులనూ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలు సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినందున ప్రభుత్వ స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లు, డైట్‌ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, మండల విద్యాశాఖాధికారి పదోన్నతులను కల్పించా లని కోరారు. పివి నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులందరినీ జిల్లా పరిషత్‌లకు అప్పగించాలని సూచించారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాకూ ఒక డైట్‌ కాలేజీని ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వ స్కూల్‌ అసిస్టెంట్లకు డైట్‌ లెక్చరర్‌ పదోన్నతులను కల్పించాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించాలనీ, నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.