కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించిన ఏకైక కీల్గుంటె వీరగల్లు

మహబూబ్‌ నగర్‌ జిల్లా, జడ్చర్ల మండలం, గంగాపూర్‌ శివారు ఆల్వాన్‌ పల్లిలో జైన గుడి గొల్లత్తగుడి వుంది. గొల్లత్తగుడి వెనక శిథిల గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లులున్నాయి. వాటి మీద శాసనాలున్నాయి. ఒకటి, రెండు తప్ప అన్ని శాసనాలు చదువడానికి అనువుగా కనిపించడం లేదు. ఒక్కొక్క వీరగల్లు ఒక్కో ప్రత్యేకత కలిగినటువంటిది. అందులో ఒక వీరగల్లు కీల్గుంటె. ఇది కన్నడం పేరు. కీల్గుంటె అంటే ఒక ఆత్మార్పణ వీరగల్లు. అయితే ఈ ఆత్మార్పణ తనకోసం కాక, తాను కొలిచే రాజుకోసం అవుతుంది. రాజు వద్ద అంగరక్షకుడుంటాడు. లెంకలుంటారు. రాజు మరణిస్తే రాజు మృతదేహంపెట్టే సమాధి కింది భాగంలో గూడులో వీరిలో ఒకరు సజీవంగా పాతిపెట్టబడుతారు. స్వచ్ఛందంగానే ఈ లెంకలు ఆత్మార్పణ చేస్తారని చరిత్రకారుల కథనం. తెలంగాణాలో లభించిన వీరగల్లులలో కీల్గుంటె వీరగల్లు ఇప్పటికిదొక్కటే. ఈ వీరగల్లు మీద శాసనముంది కాని, చదవడానికి అనువుగా లేదు. లిపి 7,8 శతాబ్దాల నాటి తెలుగులో వుంది.
మరొకటి ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా ఈపూర్లో లభించిన కీల్గుంటె శిల్పం మద్రాస్‌ మ్యూజియంలో ఉంది. అది కాకతీయ రుద్రమదేవి మరణంతో సంబంధమున్న రెండో శిల్పం. ఇంకొకటి త్రిపురాంతకంలో ఉంది.
క్షేత్ర పరిశోధన : శ్రీరామోజు హరగోపాల్‌,
వేముగంటి మురళీకష్ణ, ముచ్చర్ల దినకర్‌