వీరవనిత ఐలమ్మ

Veeravanita Ailamma– ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి స్పూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నదనీ, వారి త్యాగాలను మరువలేమనీ చెప్పారు. ఆ కాలంలోనే హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని ఆయన కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.
గవర్నర్‌ బీసీలకు వ్యతిరేకం-ఎమ్మెల్సీ కవిత
గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ బీసీలకు వ్యతిరేకమని తేలిపోయిందని ఎమ్మెల్సీ కే కవిత విమర్శించారు. అందుకే ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీన జాబితాను తిప్పి పంపారన్నారు. దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందో, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందో అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ వైఖరి ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్‌ ఆమోదించే సంప్రదాయం ఉందనీ, దాన్ని విస్మరించి బీసీ వర్గాలకు నష్టం చేయడం విచారకరమన్నారు.