వేసవిలో కూరగాయల సాగు – రైతులకు లాభదాయకం

Cultivation of vegetables in summer – profitable for farmers– ఉద్వాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జీనుగు మరియాన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు
వేసవిలో కూరగాయల సాగు – రైతులకు లాభదాయకమని ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. శుక్రవారం నెల్లికుదురు మండలంలో రతీరాం తండా, బడి తండా, నెల్లికుదురు తదితర గ్రామాలలో సాగులో ఉన్న కూరగాయల తోటలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా మహబూబాబాద్ జిల్లాలో రైతులు డిమాండ్ ఉన్న పంటలు, కూరగాయల సాగు, పూల సాగు తదితర వాటిని సాగుచేసి రైతులు నికర ఆదాయం పొందాలని, వేసవిలో కూరగాయల సాగు చేపట్టి రైతులు లాభం పొందాలని, మహబూబాబాద్ జిల్లాలో 2,537 ఎకరాలలో రైతులు కూరగాయల సాగు చేయుచున్నారన్నారు. ప్రస్తుత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో వంగ, గోరు చిక్కుడు, బెండ, దోస, సొర మరియు ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా తదితర కూరగాయల సాగువలన లాభం కలుగుతుందని, కూరగాయల సాగును ఆయిల్ పామ్ తోటలలో, పండ్ల తోటలలో అంతర పంటలుగా టమాట, మిర్చి, బీర, సొర, వంగ, గోరు చిక్కుడు, బెండ, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా తదితర పంటలతో సాగు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆధునిక పద్దతులు అయిన ఎత్తైన మడులు, పందిరి పై సాగు, ట్రెల్లీస్ పద్దతిలో, బిందు సేద్యం, మల్చింగ్ విధానం, సేంద్రియ పద్దతులను పాటించడం వలన నాణ్యమైన దిగుబడులతో పాటు 30 నుంచి 40 శాతం ఉత్పత్తి అదనంగా పెరుగుతుందన్నారు. రైతులకు వర్మి కంపోస్ట్, వేప పిండి, కానుగ పిండి, వేప నూనే వాడకంతో పాటు పూర్తి  సేంద్రియ పద్దతుల్లో వంగ, టమాట, మిర్చి, బీర, బెండ, సొర తదితర పంటల సాగు విధానాన్ని, రైతులు సమీకృత వ్యవసాయాన్ని ఆధునిక పద్దతుల్లో చేపట్టాలని అన్నారు. రైతులందరు రైతు ఉత్పత్తి సమాఖ్యలుగా ఏర్పడి, పంట కాలనీలను ఏర్పరుచుకొని, కూరగాయల సాగు చేసి మన జిల్లాలో స్వయం సమృద్ధి  సాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నాయక్ రైతులు పాల్గొన్నారు