వేములవాడ తుల ఉమకే

– పంతం నెగ్గించుకున్న ఈటల
– బీజేపీ నాలుగో జాబితా విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సుధీర్ఘమంతనాలు, మల్లగుల్లాల తర్వాత వేములవాడ అభ్యర్థిగా తుల ఉమను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఈ విషయంలో ఈటల రాజేందర్‌ పంతం నెగ్గించుకున్నారు. తన సుధీర్ఘ అనుభవాన్ని జోడించి జాతీయ స్థాయిలో సీటు కోసం పట్టుబట్టినా మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తన కొడుక్కి సీటు దక్కించుకోలేకయారు. ఈ విషయంలో వికాస్‌రావుకు చివరకు మొండిచేయి ఎదురైంది. మొత్తం 12 మందితో బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకూ బీజేపీ నాలుగు విడతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. మునుగోడు సీటును చల్లమల్ల కృష్ణారెడ్డికి ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. శేరిలింగంపల్లి సీటు విషయంలో ఇంకా ఎటూ తేల్చలేదు. స్థానిక నాయకులు బీజేపీకే ఇవ్వాలని పట్టుబడు తుండగా..జనసేన కూడా ఆ సీటును ఆశిస్తున్నది. దీంతో ఆ సీటు పంచాయతీ తేల్చడం బీజేపీకి తలకు మించిన భారంగా మారింది.
జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ పార్టీ ఎనిమిది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కూకట్‌పల్లి-ఎం.ప్రేమ్‌కుమార్‌, తాండూర్‌-ఎన్‌.శంకర్‌గౌడ్‌, కోదాడ-సతీశ్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌-వంగల లక్ష్మణ్‌గౌడ్‌, ఖమ్మం-మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం-ఎల్‌.సురేందర్‌రావు, వైరా(ఎస్టీ)-డాక్టర్‌ తేజావత్‌ సంపత్‌ నాయక్‌, అశ్వారావుపేట (ఎస్టీ)- ఎం.ఉమాదేవిని ప్రకటించింది.