జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలి: అనగంటి వెంకటేష్

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)జిల్లా కమిటీ సమావేశం  మండలం లోని పసర గ్రామంలో జిల్లా అధ్యక్షులు బి.సంజీవ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈసమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటికి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు .ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ నియమకాలను చేపట్టాలన్నారు.ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఐదువేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేయడంతో తీవ్రమైన ఇబ్బందులుపడ్డారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా  నిరుద్యోగ యువతకు పారదర్శకంగా ఉద్యోగాల నియమకాలు చేపట్టాలన్నారు‌‌.అదేవిధంగా గురుకుల విద్యాసంస్థల్లో వివిధ కేటగిరీల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వలేదని,ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు నాలుగునెలలు గడుస్తున్నా వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బి.సంజీవ,రత్న ప్రవీణ్,నాయకులు పూనం క్రిష్ణ బాబు, పిట్టల అరుణ్, చంద్రశేఖర్, చంటి, ఎండి.దిల్వార్, జక్కు వేణు, రాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు‌.