వెంకటేష్ నటించిన తన 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల కానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘హిట్ 2’ విడుదలైన తర్వాత వెంకటేష్‌ని కలవమని నిర్మాత వెంకట్ చెప్పారు. వెంకీని కలసి నా దగ్గర ఉన్న కథల్లో ‘సైంధవ్’ ఐడియా చెప్పా. ఆయనకి చాలా నచ్చింది. ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అని చెప్పారు. తర్వాత ఐడియాని డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా చెప్పాను. కథ మొత్తం విని ఓ హాగ్ ఇచ్చి.. ‘ఇది చేస్తున్నాం’ అన్నారు. ఆయన అనుభవాన్ని, ఫీడ్ బ్యాక్‌ని జోడించి స్క్రిప్ట్‌ని ఇంకా బెటర్ చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. ఇది వెంకటేష్ 75వ చిత్రం అనే టెన్షన్ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు అనిపించలేదు. కానీ గత వారం రోజులుగా ఉంది. ఈవెంట్స్‌లో వెంకటేష్ ఏవీలు చూస్తున్నపుడు ఇంత అద్భుతమైన జర్నీ ఉన్న హీరోతో సినిమా చేశామా? అనే టెన్షన్ వస్తుంది. నిజానికి ఈ ఒత్తిడి వెంకటేష్ మా వరకూ తీసుకురాలేదు. అంత చక్కగా మాతో కలిసిపోయారు. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. వెంకటేష్ 75వ చిత్రం ఎలా ఉండాలో ఆలా చేశాం. ఫ్యాన్స్, ఆడియన్స్‌కి నచ్చేలా తీర్చిదిద్దాం. ఆర్య, ఆండ్రియా, రుహాని ఇలా.. ప్రతి పాత్ర ఒక విషయాన్ని కమ్యునికేట్ చేస్తుంది. ఆ కమ్యునికేషన్ వైడర్ ఆడియన్స్‌కి చేరాలి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతుక లేదు. రూ.17 కోట్ల ఇంజక్షన్ కోసం తపన పడే పేరెంట్స్ గురించి, వారి పోరాటం గురించి మనకి పెద్ద అవగాహన లేదు. అలాంటి అవగాహన తెప్పించాలంటే వైడర్‌గా కమ్యునికేట్ చేసే నటులు కావాలి. అయితే ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ని సందేశాత్మకంగా చెప్పలేదు. సినిమాటిక్ లిబార్టీ తీసుకొని సినిమాటిక్ గానే చెప్పాం. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అనే దానిలోకి వెళ్ళలేదు. సినిమా చూసిన ప్రేక్షకులే ఒక ఆలోచనలోకి వస్తారు. చాలా ఆర్గానిక్‌గా రాసిన కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సైంధవ్ చాలా కాస్ట్లీ సినిమాలా కనిపిస్తుంది. నిర్మాత వెంకట్ మొదటి నుంచి చాలా క్లియర్‌గా ఉన్నారు. ‘నాకు వెంకటేష్ అంటే ఇష్టం. ఆయనకి గొప్ప సినిమా ఇవ్వాలి’ అని ముందే చెప్పారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ‘సైంధవ్’ని ప్రేక్షకులు ఇష్టపడితే తప్పకుండా పార్ట్ 2 చేస్తామనే నమ్మకం ఉంది. పైగా పార్ట్ 2 చేసే అవకాశం ఉన్న కథ కూడా. ఇక ‘హిట్ 3’ రైటింగ్ జరుగుతోంది. అయితే ఆ ఫ్రాంచైజ్‌లో వచ్చే సినిమాలకి ఒక మారినేషన్ పీరియడ్ ఉండాలనేది మా ఆలోచన. – దర్శకుడు శైలేష్ కొలను