వెంచర్ ముప్పు..?

వెంచర్ ముప్పు..?– మండల కేంద్రంలో గాడి తప్పిన డ్రైనేజ్ వ్యవస్థ
– దోమలకు నిలయంగా మండల కేంద్రం
– పట్టించుకోని ప్రత్యేకాధికారులు.
వ్యాపారులు కొత్త కొత్త ఒరవుడులను సృష్టిస్తూ మానవ మనుగడకు తీరని నష్టాన్ని సృష్టిస్తున్నారు.దీంతో ప్రభుత్వాలకు,ప్రభుత్వ అధికారులు ఏమి చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్తున్నారు.కొందరు ప్రజాప్రతినిధులు,అధికారులు మామూళ్ల మత్తులో వ్యవహరించిన తీరు నేడు ప్రజలకు శాపంగా మారింది.వెంచర్ల పేరునా వ్యాపారం సాగించడానికి కొందరు వేసిన ఎత్తుగడలు మండల కేంద్రంలోని డ్రైనేజీ వ్యవస్థ గాడి తప్పే పరిస్థితి ఏర్పడి గాడిలో పెట్టడానికి అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా..ఎప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధిక వర్షాలకు ప్రధాన రోడ్డు,బస్టాండ్ అవరణం చెరువును తలపించే రోజు దగ్గరలోనే ఉంది. మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన వెంచర్ల వల్ల ముప్పు తప్పదని..ఇప్పటికైన అధికారులు నిబద్ధతతో వ్యవహరించి నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన వెంచర్లపై చట్టపరమైన చర్యలకు ఊతం పోయాల్సిన అవసరముందని మండల కేంద్రంలోని ప్రజలు వాపోతున్నారు.వెంచర్ పై అధికారులు చట్టపరమైన చర్యలకు ఊతం పోస్తారా? లేక యథావిధిగా చట్టపరమైన చర్యల పేరునా మామూళ్లతోనే సర్దుకుపోతారా? వేచి చూడాల్సిందే….
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రజలు దోమల బెడదతో బెంబెలేత్తి పోతున్నారు.పగలు,సాయంత్రం, రాత్రంటూ సమయమేమి లేకుండా మండలంలోని ప్రజలు దోమ కాటుకు బలవుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పారిశుధ్య నిర్వహణ కోసం చెత్త సేకరణ,డ్రై డే ప్రైడే వంటి కార్యక్రమాలతో గొప్ప సంకల్పాన్ని అమలు చేస్తున్న వాటిని అధికారులు తుతూ మంత్రంగా వ్యవహరిస్తూ పట్టించుకోకుండా నీరుగార్చేల విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దోమలు విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ప్రజారోగ్యంపై ప్రభావం చూచూపుతున్నాయని ప్రత్యేకాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ..
మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.కాల్వల్లో మురికి నీరు నిలవడం,పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ దోమలకు నిలయంగా మారి ఇళ్లల్లోకి వస్తున్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.మండల కేంద్రంలో మురుగు నీరు కాల్వ వ్యవస్థ అధ్వానంగా మారి ప్రధాన రోడ్డుపై పారుతుండడంతో అవస్థలు పడుతున్నామని రోడ్డు ప్రక్కన ఇళ్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనదారులు,కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దోమలు కుట్టడం వల్ల మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రభలుతున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మండల,గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడం వల్లే పారిశుధ్యం పడకేసిందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా, మండలాధికారులు స్పందించి అస్తవ్యస్తంగా మారిన మురుగు నీరు కాలువల్లో దోమల మందు పిచికారీ చేయించాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల పట్టించుకోవడం లేదు..
మా ఇంటి అవరణం వద్ద మురికి కాల్వ మట్టితో నిండిపోయి ఎండ్లు గడస్తున్నాయి.మురికి కాల్వను శుభ్రపర్చాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదు.దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.దుర్వాసన వెదజల్లుతోంది.అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.మురికి కాల్వలను శుభ్రపర్చాలని విజ్ఞప్తి.
-బొమ్మిడి సాయి క్రిష్ణ,గ్రామస్తుల,బెజ్జంకి.