– అమెరికా చర్యపై అంతర్జాతీయ ఆగ్రహం
వాషింగ్టన్ : గాజాలో తక్షణమే మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని మంగళవారం రాత్రి వీటో చేయడంతో అమెరికా అంతర్జాతీయంగా పలువురి ఆగ్రహాన్ని, ఖండనలను ఎదుర్కొంది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గైర్హాజరయ్యారు. మిగిలిన 13మంది మండలి సభ్యులు తీర్మానానికి మద్దతునిచ్చారు. దీంతో గాజాలో యుద్ధాన్ని తక్షణమే ఆపాలని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కోరుకుంటున్నాయని స్పష్టమైంది. ఇప్పటివరకు 29వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 70వేల మంది గాయపడ్డారు. అమెరికా చర్య పట్ల చైనా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇది తమకు తీవ్ర నిరాశను, అసంతృప్తిని కలగచేసిందని ఐక్యరాజ్య సమితిలో చైనా దూత ఝాంగ్ జున్ వ్యాఖ్యానించారు. అమెరికా వీటో చర్య తప్పుడు సందేశాలను పంపిస్తోందని పేర్కొన్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ మాట్లాడుతూ, ఈ చర్య తీసుకోవడం ద్వారా ఇజ్రాయిల్ సాగిస్తున్న ఊచకోతలో అమెరికా కూడా భాగస్వామురాలైందన్నారు. ఫ్రాన్స్, నార్వే, రష్యా, కతార్, సౌదీ అరేబియా, పాలస్తీనా అథారిటీ పలు ఇతర దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్న తీర్మానాన్ని అమెరికా ఇప్పటివరకు మూడుసార్లు వీటో చేసింది. బందీల విడుదల ఒప్పందంపై, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ జరిపేందుకు చర్చలు జరుగుతున్న దశలో ఈ తీర్మానం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అమెరికా రాయబారి లిండా వ్యాఖ్యానించారు.