– రాజకీయ నాయకులు, ప్రధాన స్రవంతి మీడియా మధ్య వారధి
– ట్వీట్లే వార్తలు, చర్చలకు కేంద్ర బిందువులు
న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ తీరు తెన్నులను మార్చింది. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుడు ఏదైనా విషయంపై స్పందించాంటే లేఖ ద్వారానో, మీడియా సమావేశం ద్వారానో జరిగేది. అయితే, ఎప్పుడైతే సోషల్ మీడియా విప్లవం వచ్చిందో అప్పటి నుంచి ఈ తీరు మారింది. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాలే వేదికగా తమ భావాలను పంచుకుంటున్నారు. తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇందుకు, ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్రధానంగా వేదికవుతున్నది. రాజకీయ నాయకులు తమ అధికారిక ఎక్స్ ఖాతాల్లో తమ అభిప్రాయాలు, భావాలు, స్పందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీటి ఆధారంగానే ప్రధాన స్రవంతి మీడియాకు రాజకీయ నాయకుల నుంచి సమాచారం అందుతున్నది. అంటే, ఎక్స్.. రాజకీయ నాయకులు, ప్రధాన స్రవంతి మీడియాకు మధ్య వారధిగా మారిందని సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.
2017 నుంచి 2020 మధ్య భారతదేశంలో ఎక్స్(ట్విట్టర్)కు దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇతర ప్లాట్‌ఫారమ్‌ల పెద్ద యూజర్ బేస్‌ల నుంచి వచ్చిన డేటా కంటే ఎక్స్ అందించిన రియల్-టైమ్ డేటా (నిజ-సమయ సమాచారం) చాలా ఉపయోగకరంగా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఎక్స్ అనేది బ్రేకింగ్ న్యూస్‌కి మూలంగా మారిందనీ, ఇది ఎప్పుడైనా ప్రపంచ పల్స్‌కు ఉత్తమ సూచిక అని అంటున్నారు. ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల గోప్యతా పరిమితులు కొంత గందరగోళపర్చే అంశాలని నిపుణులు చెప్తున్నారు. కానీ, ఎక్స్ అలా కాదనీ, రియల్ టైమ్ ప్రాతిపదికన అత్యంత సంబంధిత, ప్రాంత-కేంద్రీకృత పోకడలను అందిస్తుందని అంటున్నారు.
పలు ఉద్యమాలకు వేదిక
మీటూ, బ్లాక్ లివ్స్ మ్యాటర్ వంటి హ్యాష్ ట్యాగ్ ఉద్యమాలకు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఎక్స్‌లోనే ట్రెండ్‌గా మారి ప్రపంచంలో ఒక విప్లవాన్ని సృష్టించాయని నిపుణులు చెప్తున్నారు. వార్తలు, సమాచారం ట్విట్టర్‌లో అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనీ, ఎందుకంటే ప్లాట్‌ఫారమ్ దాని కంటెంట్‌ను చూడటానికి సైన్ అప్ చేయాలని వినియోగదారులు కానివారిని బలవంతం చేయదని వివరిస్తున్నారు. మెజారిటీ వినియోగదారులు తమ ట్వీట్లను పబ్లిక్‌గా అలాగే ఉంచుతారు. అంటే పాఠకుడికి ట్విట్టర్ ఖాతా ఉన్నా లేకున్నా వాటిని ఎవరైనా చదవవచ్చు. భారత్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ వ్యాప్తిపై చేసిన ఒక అధ్యయనం భాషా వినియోగాన్ని విశ్లేషించింది. రాజకీయ నాయకులు, నటులు, ప్రధాన స్రవంతి మీడియా మధ్య సంభాషణలకు మధ్యవర్తిత్వం వహించడా నికి ట్విట్టర్ తన పనితీరును ఎలా విస్తరించిందో హైలైట్ చేసింది. భారత్‌లోని మిగిలిన వారితో పోలిస్తే హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ట్విట్టర్‌లో ఇంగ్లీషును ఉపయోగించటం చాలా తక్కువగా ఉన్నదని తేల్చింది. ప్రభుత్వ హ్యాండిల్స్, రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆంగ్లంలో ట్వీట్ చేసే అవకాశం ఉన్నదని వివరించింది.
ఎక్స్‌తో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ అధికారిక ఖాతాల్లో చేసే పోస్ట్‌లు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా వైరల్ కావటం, వివాదాలకు దారి తీయటం వంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా సవాళ్లు, ప్రతిసవాళ్లు.. విమర్శలు, ప్రతి విమర్శలు.. అభినందనలు, కృతజ్ఞతలు వంటి పోస్ట్‌లు కనిపిస్తాయి. ట్విట్టర్ ఖాతాదారులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంపై కొంత అవగాహన ఉన్నవారెవరైనా వీటిని చూడవచ్చు. అయితే, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అవగాహన లేని వారు ప్రధాన స్రవంతి మీడియాలో ఆ సమాచారాన్ని పొందుతారని నిపుణులు చెప్పారు. ఉదాహరణకు, ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హౌదా కల్పించే అంశాన్ని లేవనెత్తినప్పుడు, అది టీవీ, రేడియో, ప్రింట్ మీడియాలో ముఖ్యాంశాలు గా మారింది. అది ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌కు ఉన్న ఫాలోవర్ల కంటే ఎక్కువ మందికి చేరింది.2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన గ్రాఫిక్‌లోని తప్పులు సాంప్రదాయ మీడియా అంతటా ప్రచారమయ్యాయి. మరో సందర్భంలో, 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. గవర్నర్ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో బీజేపీపై దాడి చేసినపు డు.. సాంప్రదాయ మీడియా హెడ్‌లైన్‌లు, సంపాదకీయాలతో రంగంలోకి దిగింది. చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. డిసెంబర్ 2019లో, కర్నాటకలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 15 సీట్లకు 12 గెలిచి సాధారణ మెజారిటీని సాధించినప్పుడు, రాష్ట్ర ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా అన్ని టెలివిజన్, ప్రింట్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో జాతీయ ముఖ్యాంశంగా మారింది.