ఈటలతో విబేధాల్లేవ్‌

–  బీఆర్‌ఎస్‌ ఎంపీలు నాతో టచ్‌లో ఉన్నారు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పార్టీ నేత ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విబేధాల్లేవనీ, కలిసికట్టుగా ముందుకెళ్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ చెప్పారు. ఈటల అభిప్రాయాలనూ నాయకత్వం గౌరవిస్తున్నదని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మావోయిస్టు నయీమ్‌ డైరీపై విచారిస్తే బీఆర్‌ఎస్‌ నేతల గుట్టురట్టు అవుతుందని చెప్పారు. నయీమ్‌ ఆస్తులు ఎక్కడ పోయాయనే దాన్ని వెలికి తీయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ప్రజలు అధికారమిస్తే ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పును ఎలా తీరుస్తారని అడిగారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన డ్రగ్స్‌ కేసును కాంగ్రెస్‌ ప్రభుత్వం బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరినా సంస్థపైనా విచారణ చేయించాలని కోరారు.తనతో బీఆర్‌ఎస్‌ ఎంపీలు టచ్‌లో ఉన్నారని బాంబ్‌ పేల్చారు. ఓడిపోయినా కేటీఆర్‌కు అహంకారం మాత్రం తగ్గలేదని విమర్శించారు.