తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నది. సర్కారీ శాఖలు, విభాగాల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఉత్సవాలు చేయడం తప్పు కాదు. కానీ, ఏడాది నేపథ్యంలో తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడమేగాక, చేయలేనివి అంగీకరించి మున్ముందు ఎలా పరిష్కరిస్తారో కూడా ప్రజలకు చెప్పాలి. అదే జవాబుదారితనం. రూ. 18 వేల కోట్ల రుణమాఫీ, 53 వేల ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్నాలకు రూ. 500 బోనస్ తదితర పథకాలు ఆహ్వానించదగ్గవే. అలాగే రెండో ఏడాదిలోకి అడుగిడుతున్న తరుణంలో మరోసారి సమీక్షించుకుని విధాన పున:పరిశీలనతో తప్పొప్పులను సరిచేసుకోవాలి. ఒక వైపు రేవంత్ సర్కారు విజయోత్సవాలు చేస్తూ భారీ బహిరంగ సభల్లో తాము చేపట్టిన పథకాలు, ప్రాజెక్టుల గురించి సీఎం, మంత్రులు ఏకరువు పెడుతున్నారు. దీన్ని ప్రతిపక్షం కాంగ్రెస్‌వి అన్ని వైఫల్యాలేనని తిప్పికొడుతున్నది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహాజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం వంటి ఆరు గ్యారంటీల అమలు ఇంకా పూర్తికాలేదని నిలదీస్తున్నది. అంతేగాక కార్మికులు దీర్ఘకాలికంగా పోరాడుతున్న కనీస వేతనాల జీవో ఇవ్వలేదు. ఉద్యోగుల సమస్యలూ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. యూనివర్సిటీకు చాన్స్‌లర్లను నియమించినా, వాటికి జవసత్వాలనిచ్చే నిధులివ్వలేదు.
వంద రోజుల సంగతి పక్కనబెడితే 365 రోజులు కావస్తున్నా, మేనిఫెస్టో పథకాలేవీ సంపూర్ణంగా ప్రజలకు చేరలేదనేది వాస్తవం. ప్రజల్లో వ్యతిరేకత పాదుకుంటున్నది. రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. రుణమాఫీ, రైతుభరోసా తదితర పథకాలు పూర్తిస్థాయిలో అన్నదాతలకు అందనేలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతే మరిచారు. పథకాలకు పేర్లు మార్చడం సాధారణమే అయినా, ఇచ్చిన మాటకు కాంగ్రెస్ సర్కారు కట్టుబడిలేదంటూ వామపక్షాలతోపాటు ప్రతిపక్షమూ ప్రశ్నిస్తున్నది. ప్రజాసంఘాలూ గొంతెత్తున్నాయి. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందనేది కాదనలేని నిజం. కేంద్రంలోని పెద్దన్న మాత్రం అదనంగా అణా కూడా విదల్చడం లేదు. వారి కేంద్ర మంత్రులైతే రేవంత్ సర్కారుపై ఒంటికాలుమీద లేస్తున్నారు. కేంద్రం నుంచి తెచ్చేదేమీ లేకపోగా, తాము ప్రశ్నిస్తూనే ఉంటామని చెబుతుండటం విడ్డూరం. అసలు తామేమీ తెచ్చారో ప్రజలకు చెప్పాలి. దీనిపై కాంగ్రెస్ సర్కారు ఏంచేస్తున్నది ? అవసరమైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పథకాలేంటి? ఇచ్చిన నిధుల మాటేంటి? తదితర అంశాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి.
విద్యావ్యవస్థలో మార్పుల కోసం ప్రత్యేకంగా కమిషన్ నియమించడం అభినందించదగ్గ పరిణామం. అదే సందర్భంలో గురుకుల, ఇతర పాఠశాలల్లో చిన్నారులకు పెట్టే భోజనం విషతుల్యం కావడం క్షమించరానిది. కొందరు విద్యార్థులు చనిపోగా, వందలాది మంది ఆసుపత్రుల పాలుకావడం దారుణం. ఎద్దును కొని పగ్గానికి భయపడ్డట్టు భారీ ప్రాజెక్టులు నిర్మించి, కాలువలను తవ్వడం విస్మరించడంతో వాటి లక్ష్యాలు నెరవేరడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో సామాన్యులకు ఏవైతే అవసరమో వాటిని గుర్తించాలి. ఆదిశగా రెండో సంవత్సరం ప్రణాళిక ఉండాలి. కేసీఆర్ చేసిన అప్పులకు ఏడాదిగా రూ.60 వేల కోట్లు వడ్డీ కట్టామని చెబుతున్న సర్కారు, ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరముంది.
జాతిపిత మహాత్మాగాంధీకి ప్రత్యేకంగా విగ్రహాం కావాలా! ఆయన్ను భరతజాతి గుండెల్లో పెట్టుకుని గూడుకట్టిన సంగతి తెలియనిదా !? ఇకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాల సంగతి కాసేపు పక్కనబెడితే, అసలైన ఏడో గ్యారంటీ అయిన ‘స్వేచ్ఛ’ ప్రశ్నార్థకమవుతున్నది. గులాబీ బాస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదా! అనే అనుమానాలు రేకేత్తేలా రాష్ట్ర సర్కారు చర్యలు ఉంటున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కిన కేసీఆర్ సర్కారు వైఖరే ఇక్కడా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు, అగ్రహాలు వ్యక్తమవు తున్నాయి. ధర్నాచౌక్‌ను మూసేసిన గులాబీ బాస్‌కు గత ఎన్నికల్లో ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చిన చరిత్రా కండ్లముందే అద్దంలా కనిపి స్తున్నది. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఐపీసీ, సీఆర్‌పీసీ, ఐఈసీ చట్టాలను మార్చి న్యాయస్థానాల పరిధి నుంచి న్యాయాన్ని రాజ్యం చేతిలో తీసుకుంది.లగచర్ల ఆందోళనతో తెలంగాణ సర్కారు ఫార్మాసీటీ భూసేకరణ నోటిఫికేషన్‌తో పాటు ఇథనాల్ పరిశ్రమనూ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే సంగతిని పెడచెవినపెడుతున్నది. నిరసనకు అవకాశమివ్వకపోతే బీఆర్‌ఎస్ అనుభవమే రుచిచూడాల్సి రావచ్చు. తస్మాత్ జాగ్రత్త.