– ఎగ్జిట్‌పోల్స్‌తో కంగారొద్దు..
– 70కిపైగా సీట్లతో అధికారంలోకి వస్తాం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయనీ, ఆ రోజున విజయం సాధించేది బీఆర్‌ఎస్సేనని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హాట్రిక్ కొడతామని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. ‘ఈరకమైన ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినదాన్నే గొప్పగా చేసి చూపిస్తాయి. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తుంటే.. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడటమేంటని ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ఇది హాస్యాస్పదంగా అనిపిస్తుందని చెప్పారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు. ఎవ్వరూ అయోమయానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. వందకు వంద శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పోలింగ్ శాతం తేలలేదని.. ఫైనల్ పోలింగ్ ఎంత జరిగిందనేది శుక్రవారం ఉదయం తేలుతుందని తెలిపారు. ఎంత పోలింగ్ అయ్యింది? ఎక్కడ ఎంత అయ్యింది? ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేదాన్ని బట్టి అనాలసిస్ చేసుకోవచ్చన్నారు. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడంపై ఆలోచించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.