‘విక్టరీ’ మధుసూదనరావు శత జయంతి ఉత్సవం

ప్రముఖ దర్శక దిగ్గజం విక్టరీ మధుసూదనరావు శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేం దుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరమాచి నేని మధుసూదనరావు జూన్‌ 14, 1923లో జన్మించారు. ఆయన శత జయంతి ఉత్సవం జూన్‌ 11వ తేదీన హైదరాబాద్‌లోని హౌటల్‌ దస్పల్లాలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కౌన్సిల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ‘మధుసూదన రావు వంటి మహానుభావుడి దగ్గర నేను శిష్యరికం చేయడం అదష్టంగా భావిస్తున్నాను. యన్‌టిఆర్‌, ఏఎన్నార్‌, కష్ణ, శోభన్‌బాబు, కష్ణంరాజు ఇలా చాలా మంది స్టార్‌ హీరోలకు సూపర్‌హిట్‌లు ఇచ్చారు. మనిషిగా ఆయన మన ముందు లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల యేళ్లు బతికే ఉంటుంది’ అని చెప్పారు.
మధుసూదనరావు కుమార్తె వాణిదేవి మాట్లాడుతూ,’మా అమ్మా, నాన్నలు కమ్యూనిజం భావాలుగల వ్యక్తులు. ఇద్దరూ ప్రజానాట్య మండలిలో పనిచేశారు. అందుకే వారికి ఆప్యాయతలు, ప్రేమలు తప్ప అంతస్తుల తార తమ్యాలు ఉండేవి కావు. ఆయన సినిమాల్లోని పాటలు, మాటలు ఎంతో అర్ధవంతంగా ఉండేవి. పరిశ్రమ మనుగడకు నిర్మాతే ప్రాణమని భావించారు. ఆయన శత జయంతిని ఘనంగా జరుపుతున్నాం’ అని తెలిపారు.