– 321 ఛేదనలో మధ్యప్రదేశ్ 228/6
– రంజీ ట్రోఫీ సెమీఫైనల్
నాగ్‌పూర్: విదర్భ, మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ గెలుపు వాకిట నిలిచినా.. మధ్యప్రదేశ్ ఆశలు వదులుకోలేదు!. 321 పరుగుల ఛేదనలో మధ్యప్రదేశ్ 228/6తో పోరాడుతుంది. ఓపెనర్ యశ్ దూబె (94, 212 బంతుల్లో 10 ఫోర్లు), హర్ష్ గౌలి (67, 80 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో మధ్యప్రదేశ్‌ను రేసులో నిలిపారు. హిమాన్షు మంత్రి (8), సాగర్ సోలంకి (12), శుభమ్ శర్మ (6), వెంకటేశ్ అయ్యర్ (19) నిరాశపరిచారు. నాల్గో రోజు ఆట చివర్లో యశ్ దూబె వికెట్‌తో విదర్భ విజయానికి చేరువైంది. సరాన్ష్ జైన్ (16 నాటౌట్), కుమార్ కార్తికేయ (0 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. మధ్యప్రదేశ్ విజయానికి మరో 93 పరుగులు అవసరం కాగా, విదర్భ విజయానికి మరో 4 వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు యశ్ రాథోడ్ (141, 200 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షరు (77), ఆమన్ (59) రాణించటంతో విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. నేడు ఉదయం సెషన్లోనే ఫైనల్‌కు చేరే జట్టు ఎవరిదో తేలనుంది. వాంఖడెలో టైటిల్ పోరు : రంజీ ట్రోఫీ ఫైనల్‌కు ముంబయి వాంఖడె స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. తమిళనాడుపై ఇన్నింగ్స్ విజయంతో ముంబయి రికార్డు 48వ టైటిల్ పోరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. రంజీ ట్రోఫీ లీగ్ దశలో ముంబయికి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ఫైనల్‌కు విదర్భ, మధ్యప్రదేశ్‌లలో ఎవరు చేరినా.. ఆతిథ్య హక్కులు మాత్రం ముంబయికే దక్కుతాయి. ‘ముంబయి క్రికెట్‌కు అర్థ శతాబ్ద కాలంగా వాంఖడే స్టేడియం కేంద్రంగా కొనసాగుతుంది. రంజీ ట్రోఫీ ప్రాముఖ్యత దృష్ట్యా టైటిల్ పోరు వాంఖడే నిర్వహించటం సముచితం’ అని ముంబయి క్రికెట్ సంఘం కార్యదర్శి అజింక్య నాయక్ అన్నారు.