టీజీఎన్పీడీసీఎల్‌లో ‘విద్యుత్‌ ప్రజావాణి’

– సీఎమ్‌డీ కే వరుణ్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్‌ఎన్పీడీసీఎల్‌) పరిధిలో ప్రతి సోమవారం ‘విద్యుత్‌ ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంస్థ పరిధిలోని 16 సర్కిళ్లలోని సర్కిల్‌ ఆఫీస్‌, డివిజన్‌ ఆఫీస్‌, ఈఆర్వో, సబ్‌ డివిజన్‌ ఆఫీస్‌, సెక్షన్‌ ఆఫీసుల్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు తీసుకుంటారని వివరించారు. విద్యుత్‌ వినియోగదారులు తమ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. దీనికోసం వెబ్‌సైట్‌లో కన్సూమర్‌ రిసెప్షన్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సమస్యనూ నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామనీ, విద్యుత్‌ వినియోగదారులు ఈ అవకాశాలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.