– నేడు అంత్యక్రియలు
– సీఎం, డీజీపీల సంతాపం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన అకాల మృతి పట్ల ఇటు రాజకీయ పక్షాలు, అటు ఐపీఎస్, ఐఏఎస్ వర్గాలు విస్మయం చెందాయి. 1991వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రాజీవ్‌రతన్.. ప్రస్తుతం డీజీపీ హౌదాలో విజిలెన్స్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇంకా ఏడాదిన్నర పాటు సర్వీసు ఉన్నది. పంజాబ్‌కు చెందిన రాజీవ్‌రతన్.. నిజాయితీ, చిత్తశుద్ధి గల ఐపీఎస్ అధికారిగా పేరు పొందారు.
కరీంనగర్ ఎస్పీగా ప్రారంభమైన ప్రస్థానం
ఆయన ఐపీఎస్‌గా రాష్ట్ర పోలీసు శాఖలో చేరాక కరీంనగర్ ఎస్పీగా సర్వీసును ప్రారంభించారు. అనంతరం ఆయన హైదరాబాద్ నగర తూర్పు మండలం డీసీపీగా, సీఐడీ ఎస్పీగా, డీఐజీగా రాష్ట్ర ఫైర్ సర్వీస్ విభాగం అదనపు డీజీగా వివిధ హౌదాల్లో పని చేసిన రాజీవ్ రతన్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డీజీపీగా పదోన్నతి పొంది కీలకమైన రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చీఫ్‌గా బాధ్యతలను చేపట్టారు. కాగా, మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణను చేపట్టిన రాజీవ్ రతన్.. దానికి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికను ఇటీవలే అందజేశారు. ఆయన పోలీస్ శాఖకు చేసిన సేవలకు గానూ కేంద్రం ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం), భారత రాష్ట్రపతి పోలీసు పతకం (పీపీఎం)లను కూడా ఆయన అందుకున్నారు.
మరణవార్త తెలిసి ఏఐజీకి సీఎం
ఉదయం తుక్కుగూడలోని తన నివాసంలో ఆయన ఉదయం లేచి, టీ తాగాక హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే భార్య, ఇతర కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఆయనకు ఏడాదిన్నర క్రితమే గుండెపోటు రావటంతో స్టంటు కూడా వేశారు. ఆయన మరణవార్త తెలియగానే ఏఐజీకి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారీ, రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్‌లు రాజీవ్‌రతన్ భౌతిక కాయంపై పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు కూడా ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. రాజీవ్‌రతన్ అంత్యక్రియలను బుధవారం మాదాపూర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుటుంబసభ్యులు పంజాబ్ నుంచి రావాల్సి ఉన్నదనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు.
ముఖ్యమంత్రి సంతాపం
రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్‌రతన్ హఠాన్మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీ, చిత్తశుద్ధి గల ఐపీఎస్ అధికారి అయిన రాజీవ్‌రతన్‌ను కోల్పోవటం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. రాజీవ్‌రతన్ సేవలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని ఆయన నివాళులర్పించారు. ఆయన రాజీవ్‌రతన్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.