– కమీషన్ల వల్లే రాష్ట్రం అప్పులపాలు
– బ్యాంకులకు పూచీకత్తు ఇచ్చి కొత్త రుణాలిప్పిస్తాం
– ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పది జోన్లు ఏర్పాటు చేయాలి
– సీపీఎస్ రద్దు, 317 జీవోపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలి
– ప్రతిపక్ష పాత్రకు కేసీఆర్ సరిగ్గా సరిపోతారు
– మండలిలో జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపైనా విజిలెన్స్ విచారణ జరపాలని కాంగ్రెస్ సభ్యుడు టి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో రూ.1.20 లక్షల కోట్లు, మిషన్ భగీరథలో రూ.40 వేల కోట్లు, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కమీషన్ల బాగోతం వల్లే రాష్ట్రం అప్పులపాలైందన్నారు. తొమ్మిదేండ్లలో బీఆర్‌ఎస్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 2014లో రూ.ఐదు లక్షలు ఇస్తామంటే, 2022 నాటికి రూ.మూడు లక్షలకు కుదించారని అన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుంటే, నిర్మాణ వ్యయం అధికమవుతుంటే గత ప్రభుత్వం మాత్రం ఇంటి నిర్మాణాలకు ఇచ్చే వ్యయాన్ని తగ్గించిందని వివరించారు. దళితబంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించారనీ, అందులో ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారని ఆరోపించారు. తాము కులగణన చేసి పథకాలను అమలు చేస్తామన్నారు. ఐటీ సంస్థల్లో మూడు లక్షల నుంచి తొమ్మిది లక్షలకు ఉద్యోగాలు పెరిగాయని చెప్పారు. అందులో తెలంగాణ స్థానికులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. వచ్చేనెలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభిస్తామని అన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బ్యాంకులకు పూచీకత్తు ఇచ్చి కొత్త రుణాలను ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశిస్తుందని వివరించారు. జోనల్ విధానాన్ని సమీక్షించాలని కోరారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పది జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీపీఎస్ రద్దు, 317 జీవో సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీని వేసి సమీక్షించాలని కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారనీ, దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పిందనీ, కానీ ప్రజలకు మాత్రం సామాజిక తెలంగాణ కావాలన్నారు. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తుంటే గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బొగ్గు లభ్యత ఉన్న చోటే విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలన్నారు. కానీ యాదాద్రిలో ఎలా పెట్టారని అడిగారు. దీనిపై మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కల్పించుకుని నీరు, భూమి లభ్యత ఆధారంగా ఉమ్మడి నల్లగొండలో యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నెలకొల్పిందని చెప్పారు. బొగ్గును దిగుమతి చేసు కోవచ్చం టూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అప్పుడు తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాననీ, ఆ ప్రాజెక్టును స్వాగతించామని గుర్తు చేశారు.
తాతా మధుపై గుత్తా ఆగ్రహం
కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు తాతా మధు పలుమార్లు అడ్డు చెప్పారు. ఈ సమయంలో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులు కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినా వినకపోవడంతో తాతా మధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మెన్ చెప్పినా వినకపోతే ఎలా?అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మధు సైలెంట్‌గా కూర్చుండిపోయారు.