– అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆరా :వచ్చిన దరఖాస్తులు 48 వేలు 38 బృందాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన
– కదిలిన విలువైన భూముల ఫైళ్లు
– రూ.కోట్ల విలువ గల భూములు మాయం చేసినట్టు సమాచారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గూడు లేని నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏండ్లుగా జీవనం సాగిస్తున్న జాగాలను క్రమబద్ధీకరీచేందుకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 59ను తీసుకొచ్చింది. ఈ జీవోతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తే.. కొంత మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో విలువైన భూములపై కన్నేసిన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములను 59 జీవో పేర స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయిస్తోంది. త్వరలో అక్రమార్కుల చిట్టాను బయటపెట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమె ౖనట్టు సమాచారం.భూముల ధరలకు రెక్కలు రావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు మాయమ వుతున్నాయి. కబ్జా పెట్టిన భూములను క్రమబద్ధీకరించుకోవడానికి జీవో 59 వారికి వరంగా మారింది. జిల్లాలో జీవో నెంబర్ 59 కింద సుమారు 48 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం 38 బృందాలు క్షేత్రస్థా యిలో.. ప్రభుత్వ జాగాల్లో ఎవరు ఇంటి నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారన్నది పరిశీలన చేసి 59జీవో కింద అర్హులా కాదా అన్నది నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతిని ధులు కలిసి అధికా రులతో తప్పుడు రిపోర్టులు రాయించుకుని రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అత్యధిక ధరలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, నార్సింగ్, శంషాబాద్, మహేశ్వరం, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, అబ్దులా పూర్‌మెట్, హయత్‌నగర్ మండలాల పరిధిలో ఎక్కువ మొత్తంలో 59జీవో కింద ప్రభుత్వ భూములు మాయమైనట్టు తెలుస్తోంది.
రెవెన్యూ రిపోర్టులపై విజిలెన్స్ విచారణ
59 జీవో కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణాలు ఉన్నాయా..! లేదా.. వాస్తవ పరిస్థితులను పరిశీలించి రిపోర్టు చేయాలి. కానీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా కాసుల కక్కుర్తితో అర్హత లేని వారికి కూడా తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరీంచినట్టు విచార ణలో ఒక్కొక్కటి బయటపడ్తున్నాయి. అప్రూవ్ అయిన ఫైళ్లలో 20శాతం రాజకీయ నేతల ప్రోద్భలంతో క్లియర్ అయినట్టు తెలిసింది. త్వరలో ఎన్ని భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోయినవి అన్నది బయట పెట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో అక్రమా ర్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అధికారులు, అక్రమాలకు పాల్పడిన వారికి చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెలిపారు.