విహాంగమై ఎగురుతున్నది

పాఠశాలలకు సెలవులు ఇచ్చారు
బాల్యం ఆకాశంలో పతంగయ్యింది
వీధులలో అల్లరి వరదై పారుతుంది
ఇల్లంత సందడితో నిండుతుంది
చదువు పంట సాగు చేసిన కనురెప్పలు
తాళ్ళను విప్పుకొని నిద్ర చెట్టు కింద
రెప్పలు వాల్చాయి
తల్లిదండ్రులకు బాల్యం
గుండెచప్పుడు వినిపిస్తుంది
బాల్యం ఇంట్లో పెరుగు మీగడై
వొలికి పోతుంది
చదువు బరువు మోసి మోసి
వంగిన మనసు
జూలు విప్పుకొని నిటారై
పరుగు తీసింది
ఎప్పుడు చదువు చిల్కొయ్యకు
వేలాడుతున్న బాల్యం
విడుదలయ్యింది
పొట్టనిండా తింటే
నిద్ర దేవత వచ్చి
ఆవహిస్తుందని వెలితిగా ఉండే
చిన్ని బొజ్జలు నిండుగై
గురకపెడుతున్నాయి
ఉదయం సంధ్యా చూడక
పెలుసుబడ్డ బాల్యం
సూర్యరష్మిలో తానం చేస్తుంది
మట్టి సొబగులు తెలియక
పీచుకట్టిన ఇప్పుడు అందులో
బొర్లి తనువుకు రుద్దుకుంటున్నాయి
మబ్బుల ఇరుకుల్లో
ఇరికిన చందమామ
స్వేచ్ఛగా ఇప్పుడు వెలుగులీనుతుంది
– గుండెల్లి ఇస్తారి
9849983874