రెండు నెలలుగా నిలిచిన విజయ పాల బిల్లులు

– ఆగ్రహంతో రోడ్డెక్కిన పాడి రైతులు
– ఇరువైపులా నిలిచిన వాహనాల రాకపోకలు
నవతెలంగాణ-కోటగిరి
విజయ పాలకేంద్రం రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి రైతులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 68 మంది రైతులు విజయ పాల కేంద్రంలో ప్రతిరోజూ 350 లీటర్ల పాలను పోస్తున్నట్టు తెలిపారు. 15 రోజులకు ఒకసారి సుమారు రూ.మూడున్నర లక్షల విలువగల బిల్లులు చెల్లించవలసి ఉంటుందని, కానీ ఇప్పటివరకు మూడు బిల్లులు కూడా రాకపోవడంతో రుణాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్ర లోన్‌ ద్వారా రుణం తీసుకున్నామని, బ్యాంక్‌ అధికారులు రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. డబ్బులు లేక పాడిపశువులకు సరైన దాణా తీసుకురాలేక పోతున్నామని, దాంతో పాల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. పాల బిల్లు రాకపోవడంతో అన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నామని, పాల కేంద్రం అధ్యక్షులు పలుమార్లు విజయ పాల కేంద్రం జిల్లా అధికారికి తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో రోడ్డెక్కినట్టు తెలిపారు. బిల్లులు సకాలంలో రాక అప్పుల పాలవుతున్న తమను ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పాఠశాల బస్సులు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సందీప్‌ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను అధికారులకు తీసుకెళ్తానని రాస్తారోకో విరమించమని కోరడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ విషయంపై ఎస్‌ఐ సందీప్‌ పాల కేంద్రం పీడీ నందకుమారిని వివరణ కోరగా.. ఆలస్యమైన మాట వాస్తవమేనని బుధవారం సాయంత్రానికి ఒక బిల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా వెంటనే బిల్లు మంజూరు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఆందోళనలో శ్రీధర్‌, రమేష్‌, రవి, తదితర రైతులు పాల్గొన్నారు.