
నవతెలంగాణ – భువనగిరి రూరల్
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సాయని విజయభారతి గురువారం నాడు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ను సందర్శించగా, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాగే ఆమెకు పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాచకొండ కమిషనరేట్ భువనగిరి డిజిపి రాజేష్ చంద్ర లు ఆమెకు స్వాగతం పలుకగా, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మ జ్యోతి రావు పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సాయని విజయభారతి గురువారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆలేరు మండల కేంద్రము లోని మహాత్మ జ్యోతి రావు పూలే బాలుర రెసిడెన్షియల్ (రాజపేట) పాఠశాలను ఆమె తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి బోధనా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అవరణలోని వెల్నెస్ సెంటరులో రిజిస్టర్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న వైద్య సహాయం వివరాలను, మందులను, మెడికల్ కిట్స్ పరిశీలించారు. మెనూ గురించి విద్యార్థులను అడిగి స్వయంగా కిచెన్ లో వంటలను, వారికి వడ్డించిన విధానాన్ని పరిశీలించారు. స్నానపు గదులు, టాయిలెట్స్ పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, రాత్రి సమయంలో రక్షణగా ఎంతమంది ఉంటారనేది అడిగారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఆర్.సి ఇన్స్పెక్టర్ అరుణ్ త్యాగి, రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య లు పాల్గొన్నారు.