విలక్షణ విశాల్‌ని చూడబోతున్నారు

విశాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మార్క్‌ ఆంటోని’. పాన్‌ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఈనెల 15న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. విశాల్‌ పాత్రలో ఉన్న వేరియేషన్స్‌, ఎస్‌.జె.సూర్య పాత్ర, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, టైమ్‌ ట్రావెల్‌ ఫోన్‌ కాన్సెప్ట్‌, సునీల్‌ డిఫరెంట్‌ లుక్‌, సెల్వ రాఘవన్‌ పాత్రతోపాటు 80-90 దశకంలో ఓ ఊపు ఊపిన సిల్క్‌ స్మిత పాత్రను కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. చివరిగా ఇది మార్క్‌ సమస్య .. నా బాబు ఆంటోనీని నేనే చంపుతా అని కొడుకు పాత్రలోని విశాల్‌ చెప్పటం.. తండ్రి పాత్రలో విశాల్‌ అక్కడ పగలబడి నవ్వటంతో పాటు గుండు లుక్‌లో స్టైలిష్‌ విశాల్‌ లుక్‌ స్టన్నింగ్‌గా ఉంది. ఇప్పటి వరకు విశాల్‌ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు అనిపిస్తోంది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే డిఫరెంట్‌ ఎమోషనల్‌ మూవీగా ఎంటర్‌టైన్‌ చేయనుందని ట్రైలర్‌ చెప్పకనే చెప్పింది.