– గీతకు సరిపోయేటన్ని ఈత చెట్లు లేవు.. గ్రామకమిటీకి డబ్భులెలా చెల్లించేది: గీత కార్మికులు
నవతెలంగాణ – ఏర్గట్ల
గత కొన్ని నెలల నుండి తాళ్ళ రాంపూర్ గ్రామకమిటీకి,గీత కార్మికులకు కల్లుగీత విషయంలో వివాదం నడుస్తూనే ఉంది.ఇది చిలికి చిలికి పెద్ద సమస్యగా మారింది.విషయం పోలీస్ లు,ఆబ్కారీ అధికారులు,నాయకుల వద్దకు వెళ్ళినా…ఇరువురికి సయోధ్య కుదరక సమస్య పరిష్కారం కావడం లేదు.ఇక విషయానికి వస్తే తాళ్ళ రాంపూర్ గ్రామంలో 48 గీత కార్మిక కుటుంబాలు ఉన్నాయి.అందులో 23 మంది గీత వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు.ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కోసం గ్రామ కమిటీకి ఒప్పందం ప్రకారం డబ్భులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది.అయితే ఈ సారి కొంత డబ్భు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని గ్రామకమిటీ వారు అన్నారని, అంత పెద్ద మొత్తంలో తాము డబ్భులు చెల్లించలేమని గౌడ కులస్తులు అనడంతో లొల్లి ముదిరిందని,అడిగినన్ని డబ్భులు ఇవ్వకపోవడంతో, తమను కమిటీ వారు బహిష్కరణకు గురిచేశారని గౌడ కులస్తులు ఆరోపించారు.ఇదే విషయమై గ్రామ కమిటీ సభ్యులను వివరణ కోరగా… మేము గౌడ కులస్తులను బహిష్కరణకు గురి చేయలేదని,కొన్ని వార్త పత్రికల్లో,ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చిన వార్తలు అవాసత్వం అని అన్నారు.వారిని తాటి చెట్లు గీయుమని అన్నామని,ఈత కల్లులో ఎలాంటి మత్తు పానీయాలు,చక్కెర కలుపకుండా,స్వచ్ఛమైన ఈత కల్లు మాత్రమే పోయాలని కోరామని అన్నారు.వారు ఒప్పుకోక పోగా,తమను వేధిస్తున్నారని మాపై కేసులు పెట్టారని తెలిపారు. ఇప్పటికైనా సామరస్యంగా వారితో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. గౌడ కులస్తులను ఈ విషయమై వివరణ కోరగా… అదంతా అవాస్తవం అని,తాము కల్లు గీసుకోవడానికి సరిపోయేటన్ని చెట్లు లేవని,కొన్ని చెట్లతో కల్లు గీసుకుని తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని,గ్రామ కమిటీకి డబ్భులు ఎలా కట్టాలో తెలియక తమ బ్రతుకు దుర్భరమయ్యిందని అన్నారు.ఇదే కాక తమ గ్రామానికి చెందిన వారికి, మేము గీసిన కల్లు అమ్ముకోకుండా గ్రామాభివృద్ధి కమిటీ వారు కొందరు వ్యక్తులను తమకు కాపలా ఉంచి తమను కల్లు అమ్ముకోకుండా చేశారని ఆరోపించారు.ఇదిలా ఉంటె పాత గొడవలు మనసులో పెట్టుకోకుండా, ఇరువురు ఒక సయోధ్యకు వచ్చి సమస్య పరిష్కరించుకోవాలని అధికారులు,పోలీస్ లు , గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.