– మూడు నెలల వీధిలో నాలుగు సార్లు దోపిడీ
నవతెలంగాణ – మిరు దొడ్డి
వరుస దొంగతనాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేసాము కదా, లేదంటే పోలీసులు పెట్రోలింగ్ చేస్తారులే అనుకుంటే పొరపాటే.. రాత్రి సమయంలో తాళం వేసి, ఎక్కడికైనా వెళ్లారో, వచ్చేసరికి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బులను దోచేస్తున్నారు దొంగలు. ఇది ఎక్కడో కాదు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న వరుస దొంగతనాలు. దుబ్బాక నియోజకవర్గంలో గత మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు దొంగలు బీభత్సం చేశారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. గత రాత్రి మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో తాళాలు వేసిన ఐదు ఇండ్లలో చోరీకి పాల్పడి నగదు, వెండి, బంగారం నగలతో దొంగలు ఊడయించారు. గత మూడు నెలల క్రితం ఇదే గ్రామంలో మూడు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఇదే తరహాలో గతంలో దుబ్బాక మండలం తిమ్మాపూర్, తోగుట మండల కేంద్రంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇలా వరుస దొంగతనాలతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా తయారైంది. దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నప్పటికీ దొంగలు మాత్రం దొరకడం లేదు. పోలీసులు దొంగలను పట్టుకుని వారి ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.