
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో మంగళవారం గ్రామస్తులు ముగ్గురు అపరిచిత వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. సర్పంచ్ సక్కారం అశోక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ నాగపూర్ లో ఆశ్రమం ఉంది, చందాలు ఇవ్వండని డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో ఎస్సీ కాలనీలో ఒకరి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఇంటి పక్కింట్లో ఉండే ముండ్ల రమేష్ వారిని పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమక్షంలో అప్పగించారు. వారి వివరాలను తెలుసుకునేందుకు సర్పంచ్ అశోక్ ప్రయత్నించిన వారి వద్ద సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులకు ముగ్గురు అపరిచిత వ్యక్తులను అప్పగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారి వివరాలు అడిగి తెలుసుకోవాలని, నుమానం కలిగితే గ్రామపంచాయతీకైనా, పోలీసులకైనా సమాచారం అందించాలన్నారు.