– వేలంలో రూ.1.26కోట్లు
– బండ్లగూడ రిచ్‌మండ్ విల్లాలో ఘటన
– బాలాపూర్ లడ్డూ రూ.27లక్షలు
నవతెలంగాణ-గండిపేట్/ బడంగ్‌పేట్
వినాయక లడ్డూ వేలం రికార్డు స్థాయిలో పలికింది. బండ్లగూడలో రూ.1.26కోట్లకు లడ్డూను బీఆర్ దియా చారిటబుల్ ట్రస్టు సభ్యులు వేలంలో దక్కించుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.27లక్షలు పలికింది. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిధిలోని పీఎస్ కాలనీ రిచ్‌మండ్ విల్లాలో వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో విల్లాలో ఉండే సుమారు 300 కుటుంబాలు పాల్గొన్నాయి. వీరంతా లడ్డూను రూ.1.26కోట్లకు దక్కించుకున్నారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులు, సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ వేలంలో మరోసారి రికార్డు ధర పలికింది. రూ.27 లక్షలకు తూర్కయాంజాల్‌లోని పాటిగూడ గ్రామానికి చెందిన దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గురువారం అశేష జనవాహిని మధ్య ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం, శోభా యాత్ర జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వంగేటీ లక్ష్మారెడ్డి లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలం పాట పోటా పోటీగా జరగ్గా దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ గ్రామానికి చెందిన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్న సంగతి తెలిసిందే.