వినేశ్‌ ఫోగట్‌కు పారిస్‌ బెర్త్‌ అన్షు, రీతిక సైతం అర్హత

వినేశ్‌ ఫోగట్‌కు పారిస్‌ బెర్త్‌ అన్షు, రీతిక సైతం అర్హతన్యూఢిల్లీ : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఏ భారత మహిళా రెజ్లర్‌ రెండు సార్లు పోటీపడలేదు. వినేశ్‌ ఫోగట్‌ రికార్డు స్థాయిలో మూడోసారి ఒలింపిక్స్‌లో ఉడుం పట్టుకు సిద్ధం కానుంది. ఏసియన్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్‌లో వినేశ్‌ ఫోగట్‌ సత్తా చాటింది. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో కజకిస్థాన్‌ రెజ్లర్‌ లారాపై 4.18 నిమిషాల కుస్తీలో 10-0తో సాంకేతిక ఆధిపత్యంతో విజయం సాధించింది. వరల్డ్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ అన్షు మాలిక్‌ ఉబ్బెకిస్థాన్‌ రెజ్లర్‌ సోబిరోవపై 2.48 నిమిషాల్లో 11-0తో గెలుపొందగా.. అండర్‌-23 వరల్డ్‌ చాంపియన్‌ రీతిక 7-0తో చైనీస్‌ తైపీ రెజ్లర్‌ చాంగ్‌ను చిత్తు చేసింది. మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్‌, 76 కేజీల విభాగంలో రీతిక భారత్‌కు ఒలింపిక్‌ బెర్త్‌లు సాధించారు. నేడు జరిగే ఫైనల్లో ముగ్గురు భారత రెజ్లర్లు పసిడి కోసం ఓ పట్టు పట్టనున్నారు.