క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు ఎంత పెద్దవారైనా ఉపేక్షించం

– పార్టీ లైన్‌లో పని చేయాల్సిందే… : హైదరాబాద్‌ డీసీసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎంతటి పెద్ద నాయకుడైన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ హెచ్చరించారు. పార్టీ నియమ, నిబంధనల ప్రకారం పని చేయాల్సిందేనన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లా కమిటీ, కార్పొరేటర్లతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పది నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసిందని తెలిపారు. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి మాట్లాడుతూ కాంగ్రెస్‌ జాతీయ దృక్పథంతో పని చేస్తున్నదని తెలిపారు. రాహుల్‌ గాంధీ విద్వేషాల వీధిలో ప్రేమ దుకాణం తెరవాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నేతలుగా విభేదాలను మరిచిపోయి కలిసి పనిచేయాలన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్‌, విశ్వనాధం, మేయర్‌ విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, సమీరుద్దీన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దర్పల్లి రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.