మానవ హక్కుల ఉల్లంఘన నేరం..

– పోషకాహారం లేకపోతే మనిషి అభివృద్ధి శూన్యం
– దళిత స్త్రీశక్తి సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మానవ హక్కులను పొందినప్పుడే అన్ని రకాల అసమానతలు పోతాయనీ, రాజ్యాంగ విలువలు రక్షించబడతాయనీ, కానీ..పోరాడి సాధించుకున్న హక్కులు ఉల్లంఘించటం నేరమనే విషయాన్ని మర్చిపోతున్నారని వక్తలు తెలిపారు. అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో’ మానవ హక్కులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి’ అనే అంశంపై డీఎస్‌ఎస్‌ జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించారు. అంబాసిడర్‌ వినోద్‌కుమార్‌, రిటైర్డ్‌ ఐడీఏఎస్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి, ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కో ఆర్డినేటర్‌ వెంకటరెడ్డి, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ శశికళ,అడ్వకేట్‌ సాధిక్‌అలీ, ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ సిద్దోజ్‌రావ్‌, ప్రొఫేసర్‌ శోభ తదితరులు మాట్లాడారు. జీవించే హక్కు అత్యంత ప్రధానమైనదనీ, అదే ఉల్లంఘనకు గురైతే మానవ హక్కులకు అర్థమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే హక్కుల అమలు సాధ్యమవుతుందని తెలిపారు. పిల్లలకు సరైన పోషకాహారం అందటం లేదని వివరించారు. ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి లేనప్పుడు సమాజ అభివృద్ధి శూన్య మని చెప్పారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల, ముఖ్యంగా మహిళల విషయంలో హక్కుల ఉల్లం ఘన జరుగుతున్నదని వివరించారు. ఝాన్సీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రా ల్లోని మురికి వాడలు,పాఠశాలలు, వసతి గృహాల్లో మానవ హక్కులపై 16 రోజులుగా ప్రచారం నిర్వహించినట్టు వివరించారు. 70 కేసులను గుర్తించి అధికారులతో ముఖాముఖి మాట్లాడినట్టు తెలిపారు. మహిళలపై జరుగు తున్న అఘాయిత్యాలు, దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు.