– ఇజ్రాయిల్ చర్యలపై ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
– పదాతి దాడులకు సిద్ధమైతే ముందస్తు చర్యలు తప్పవన్న ఇరాన్
– నెతన్యాహుతో భేటీ కానున్న బైడెన్
– గాజాపై కొనసాగుతున్న దాడులు
– సరిహద్దు క్రాసింగ్స్ తెరిచేది లేదన్న ఇజ్రాయిల్
జెరూసలేం, గాజా: ఇజ్రాయిల్ గాజాను దిగ్బం ధించడం, పైగా గాజా ప్రాంతం నుండి ప్రజలందరి నీ బలవంతంగా ఖాళీ చేయించడం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమని ఐక్యరాజ్య సమితి మంగళవారం పేర్కొంది. ఇదిలావుండగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఇజ్రాయిల్‌లో పర్యటిం చనున్నారు. ఆత్మ రక్షణ కోసం ఇజ్రాయిల్ చర్యలు తీసుకునే హక్కు వుందని స్పష్టం చేసేందుకు ఆయన ఈ పర్యటన జరపనున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో ఆయన చర్చలు జరుపుతారు. ఆ తర్వాత జోర్డాన్ వెళ్లి అరబ్ నేతలతో చర్చలు జరుపుతారు. గాజాకు మానవతా సాయం వేగంగా అందడంపై చర్చిస్తారు. పాలస్తీనియన్ల ఊచకోతను తక్షణమే ఆపాలని ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని డిమాండ్ చేశారు.
గాజాలో పాలస్తీనియన్లపై జరుపుతున్న నేరాలకు ఇజ్రాయిల్ అధికారులు విచారణను ఎదుర్కొనాలన్నారు. గాజాలో అత్యాచారాలను ఇజ్రాయిల్ ఆపకపోతే మరో షాక్‌వేవ్ రావడానికి సిద్ధంగా వుందని ఇరాన్ గార్డ్స్ కమాండర్లు హెచ్చరించారు. గాజాపై పదాతి దాడులకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లైతే ముందస్తు చర్యలు తీసుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. దానిపై ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ప్రధాని బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇరాన్, హిజ్బుల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ”ఉత్తర ప్రాంతంలో మమ్మల్ని పరీక్షించవద్దు, గతంలో చేసిన తప్పునే చేయొద్దు, ఈనాడు మీరు చెల్లించే మూల్యం ఇంకా భారీగా వుంటుంది” అని హెచ్చరించారు.
2,800కు పెరిగిన పాలస్తీనా మృతులు.. మొత్తం మరణాలు 4 వేలు
గత రాత్రంతా గాజాపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇజ్రాయిల్ రక్షణ బలగాలు (ఐడిఎఫ్) తెలిపాయి. 200కి పైగా హమస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ లక్ష్యాలపై దాడి జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. 71మంది చనిపోయారు. పలు వురు గాయపడ్డారు. మంగళవారం కూడా ఈ పరి స్థితి కొనసాగింది. దక్షిణ గాజాలో భారీగా దాడులు జరిగాయని పాలస్తీనియన్లు తెలిపారు. రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో ముమ్మరంగా దాడులు జరిగా యని, మృతుల వివరాలు వెంటనే అందలేదని చెప్పా రు. తమవద్ద బందీలుగా వున్న 200మందినీ పరి స్థితులు అనుకూలించినప్పుడు విడుదల చేస్తామని హమస్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. గత వారం రోజుల్లో ఇరువైపులా నాలుగు వేల మందికి పైగా మరణిం చారు. వీరిలో పాలస్తీనా వైపు 2800మంది చనిపోయారు. ఇజ్రాయిల్ దూకుడు చర్యలను పలు దేశా లు, ప్రభుత్వాలు, ఎన్‌జిఓలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. గాజాపై విచక్షణారహిత బాంబు దాడులను తక్షణమే ఆపాలని కోరుతున్నాయి.
గాజాలోకి ప్రవేశించాలన్నా, బయటకు రావాల న్నా మొత్తంగా ఏడు సరిహద్దు క్రాసింగ్‌లు వున్నాయి. 1993లో ఓస్లో ఒప్పందం నేపథ్యంలో ఈ క్రాసింగ్‌లను నిర్మించారు. 2000 నుండి వీటిని ఇజ్రాయిల్ అడపాదడపా మూసేస్తూ వుంది. తాజాగా ఘర్షణలు నెలకొన్న తరుణంలో మొత్తంగా అన్నింటినీ మూసివేసే వుంచింది. అన్నింటినీ తెరిచేది లేదని స్పష్టం చేసింది. రాఫా క్రాసింగ్స్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు వేచివున్నారు. ఎప్పుడు తెరిస్తే అప్పుడు ఈజిప్ట్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా వున్నారు. గాజా ప్రజలకు సాయమందించేందుకు ఇజ్రాయిల్ అనుమతిస్తేనే తాము విదేశీయులకు సరిహద్దులు తెరుస్తామని ఈజిప్ట్ షరతు పెట్టింది.