శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..

– ప్రచారానికి అనుమతి  తప్పనిసరి…
– ఓటర్లను ప్రలోభ పెట్టినా కేసులు..
– రాజకీయ పార్టీల నేతలకు డీఎస్పీ స్పష్టం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని,ఎన్నికలు సజావుగా జరిగేలా రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని పాల్వంచ డీఎస్పీ,అసెంబ్లీ ఎన్నికల అశ్వారావుపేట నియోజక వర్గం లా అండ్ ఆర్డర్ నోడల్ అధికారి  వెంకటేష్ కోరారు. ప్రచారం, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక రైతు వేదిక లో బుధవారం రాజకీయ పార్టీల నేతలతో ఆయన ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి కోసం “సువిధ యాప్” ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నుండి పోలీస్ శాఖకు దరఖాస్తు వచ్చిన వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు.దరఖాస్తు సమగ్రంగా ఉండాలని, దరఖాస్తుదారులు అన్ని వివరాలను పూర్తి చేయాలని తెలిపారు.ఇప్పటికే రౌడీ షీటర్ లు పై బైండోవర్ కేసులు నమోదు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు, గొడవలకు నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆచరించాలి అని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించ వద్దని ఆదేశించారు. ఎన్నికల్లో నమోదైన కేసులు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.అనుమతులు మేరకే ప్రచారం, సమావేశాలు, సభలు నిర్వహించాలని,పరిధి దాటి వ్యవహరిస్తే ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు అని, ఫ్లైయింగ్ స్క్వాడ్ ఎప్పుడూ నిఘా ఉంటుందని చెప్పారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్.హెచ్.ఒ ఎస్సై శ్రీకాంత్, జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల బాధ్యులు పాల్గొన్నారు.