– కనిపించని ప్రథమ చికిత్స, ఫిర్యాదుల పెట్టెలు
– పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
నవతెలంగాణ-నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు చట్టబద్ధంగా అందించాల్సిన సేవలను నిర్వాహకులు గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని విక్రయించడమే కాదు.. వినియోగదారులకు వాటిలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ అవి ఎక్కడ అమలు కావడం లేదు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల వాహనాల టైర్లకు గాలిని ఉచితంగా నింపాలి. ప్రతి బంకుల్లో గాలి నింపే యంత్రం విధిగా ఉండాలి. వాహనదారులు టైర్లలో గాలి నింపమని కోరితే కొన్ని బంకుల్లో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గాలి యంత్రం పనిచేయడం లేదని తప్పించుకుంటున్నారు. వాహనాలకు గాలి నింపేందుకు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా చాలా చోట్ల యంత్రాలు కనిపించకుండా ఏర్పాటు చేసి వాడకుండా వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల బంకుల్లో టైర్లకు గాలి నింపేందుకు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనానికి పది రూపాయలు నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు.
కనిపించని మరుగుదొడ్లు, తాగునీరు
ప్రతి బంకులో మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలి. చాలామంది బంకుల నిర్వాహకులు మూత్రశాలల బోర్డులు పెట్టారు కానీ వాటి నిర్వహణ మరిచారు. పెట్రోల్ బంకుల వద్ద తాగునీటి వసతి కూడా ఉండాలి కానీ చాలా బంకుల్లో ఈ సౌకర్యం లేదు. తాగునీటి సదుపాయం కల్పించడానికి పంపు నిర్వాహకుడు ఆర్వో యంత్రం, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి. కానీ నిర్వాహకులు ఇదేం పట్టించుకోవడం లేదు.
వాహనదారుల సొమ్ముతోనే
పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలను కల్పించడానికి వాటి నిర్వాహకులు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నది ఏమీ లేదు. అవి వినియోగదారుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నవే, లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ వినియోగదారుడు పెట్రోల్ బంకుల వారికి 4 నుండి 6 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాడు. టాయిలెట్ నిర్వహణ వ్యయం కింద అన్ని పెట్రోల్ బంకుల్లో విరియోగదారుల నుండి ఈ విధంగా వసూలు చేస్తున్నాయి. సగటు పెట్రోల్ బంకుల్లో రోజుకు పదివేల లీటర్ల అమ్మితే టాయిలెట్ నిర్వహణ వ్యయం కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం ఒక్క రోజుకి 600 రూపాయలు ఉంటే నెలకు 18000 వేలు అన్నమాట. వీటితో వచ్చిన డబ్బులతో టాయిలెట్ మంచినీటి ఇతర సౌకర్యాలు అందిం చాల్సిన బాధ్యత పెట్రోల్ బంకులదే. కాని ఇవేమి ని ర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెట్రోలు బంకుల్లో తనిఖీలు నిర్వహించాలని వాహనదారులు కోరుతున్నారు.
నామమాత్రపు తనిఖీలు
పెట్రోల్ బంకుల్లో సేవలపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై ఆందోళన చేసినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించవచ్చు.. లేదా బంకులను మూసివేయవచ్చు. కానీ ఇప్పటివరకు ఇలాంటివి జరిగిన దాఖలాలు ఒకటి కూడా లేవు. నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.