– ప్రీలాంచింగ్ సహించేది లేదు : కార్యదర్శి యాదిరెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రియలెస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ సంస్థ కార్యదర్శి యాదిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ప్రీ లాంచింగ్ పేరుతో వెంచర్లలో ప్లాట్లు విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, అలాంటి వారికి కచ్చితంగా నోటీసులు జారీ చేసి, జరిమానాలు విధిస్తామని అన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, ఇతర స్థానిక సంస్థల అనుమతులతోపాటు ‘రెరా’లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనీ, ఆ తర్వాతే మార్కెటింగ్ వ్యాపార ప్రకటనలు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా జరిగితే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం వరకు అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఆయా ప్రాజెక్టుల గురించి చేసుకొనే ప్రచారంలో తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నెంబరును ప్రదర్శించాలని చెప్పారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీ చేసి రూ.21 కోట్ల అపరాధ రుసుము విధించామన్నారు. ఏర్పడిన జ్యుడీషియరీ అధికారాలతో స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ గృహ కొనుగోలుదారుల రక్షణ కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. బిల్డాక్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రెరా నోటీసులు ఇచ్చిందనీ, వారి సమాధానం సంతృప్తికరంగా లేనందున మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. ఆ తర్వాత ఫిర్యాదుదారులు, బిల్డాక్స్ యాజమాన్యాన్ని పిలిచి ట్రిబ్యునల్ పరిధిలో విచారణ జరిపామనీ, ఈనెల 4వ తేదీ మరోసారి విచారణ ఉన్నదని వివరించారు.