చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులే

Violation of the law is a case– పొలాల్లో మంటలు పెడితే ఎఫ్‌ఐఆర్‌లు
– రైతులకు పంజాబ్‌ ప్రభుత్వం హెచ్చరిక
న్యూఢిల్లీ: వరి గడ్డిని కాల్చేస్తున్న రైతులపై కఠినంగా వ్యవహరించాలని పంజాబ్‌ ప్రభుత్వం పోలీసులకు, రాష్ట్ర పరిపాలనకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 8 (బుధవారం) నాటికి రాష్ట్రంలో ఒకే రోజులో వ్యవసాయ అగ్నిమాపక సంఖ్య 2,000 మార్కును దాటిన తర్వాత ఇది రావటం గమనార్హం. పంజాబ్‌లో ఈ సీజన్‌లో దాదాపు 23,000 వ్యవసాయ అగ్నిప్రమాదాల కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 6 వరకు ఐపీసీ సెక్షన్‌ 188 కింద 18 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని సమాచారం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆయన మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యుల స్వస్థలమైన సంగ్రూర్‌లో బుధవారం అత్యధిక సంఖ్యలో పొలాల్లో మంటల కేసులు నమోదయ్యాయి. పంట పొలాల వ్యర్థాల దహనంపై రోజువారీ సమాచారం వచ్చిన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు కమిషనర్లు, సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్‌ఎస్పీలు) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్‌ వర్మ కోరారు. జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్‌ఎస్పీలు కూడా క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని కోరారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (డాకుందా) ప్రధాన కార్యదర్శి జగ్‌మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రైతులు సబ్సిడీ ధరలపై పంట అవశేషాల నిర్వహణ (సీఆర్‌ఎం) యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 25,000 మంది మాత్రమే వాటిని పొందగలిగారు. సీఆర్‌ఎం యంత్రాల లభ్యతకు, డిమాండ్‌కు మధ్య ఉన్న ఈ భారీ అంతరం రైతులను పంట వ్యర్థాలను తగలబెట్టేలా చేసింది” అని అన్నారు.