– ఇద్దరు మృతి
ఇంఫాల్ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్‌లోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు, చర్చిలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామానికి రక్షణగా ఉన్న ఇద్దరు వ్యక్తులపై అస్సాం రైఫిల్స్‌కు చెందిన వారు కాల్పులు జరిపారని గిరిజన సంస్థ ఐటీఎల్‌ఎఫ్ తెలిపింది. అస్సాం రైఫిల్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పారామిలటరీ దళం. ఖమెన్‌లోక్ ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైనది. ఇంఫాల్ లేదా సైకుల్ మీదుగా ఈ ప్రాంతానికి వెళ్లవచ్చు. గత నెలలో ‘ది వైర్’ పోర్టల్ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రయత్నించగా కేంద్ర, రాష్ట్ర బలగాలు నిలువరించాయి.
ఖమెన్‌లోక్‌లో అనేక చర్చిలు ఉన్నాయి. అవన్ని మంటల్లో తగలబడుతుంటే కొందరు పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. మైతీ తెగకు చెందిన అరమ్‌బారు తెంగాల్ గ్రూపు ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలను తగలబెట్టిందని కుకీలు ఆరోపించారు. ఈ గ్రూపుకు చెందిన వ్యక్తులు సైకుల్‌లోని సెనమ్ కోమ్ ప్రాంతంపై దాడి చేశారని, గ్రామ వాలంటీర్లపై కాల్పులకు తెగబడ్డారని, రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా అరమ్‌బారు తెంగాల్ సభ్యులు మణిపూర్ పీసీసీ అధ్యక్షుడిపై దాడి చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. కేంద్ర బలగాలు, భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నప్పటికీ ఈ దాడి జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇదిలావుండగా సరిహద్దు పట్టణమైన మోరెలో కుకీ తెగకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. తమ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
మణిపూర్‌లో గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న హింసాకాండలో 300కు పైగా చర్చిలు దగ్థమయ్యాయి. 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ చాలా వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.