మణిపూర్‌లో మళ్లీ హింస

– ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి
–  ఇంఫాల్‌ లోయ సహా పలు ప్రాంతాల్లో 24 గంటల సమ్మె
బిష్ణుపూర్‌ (మణిపూర్‌) : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లా క్వాక్తా సమీపంలోని ఉఖ్ఖా తంపఖ్‌ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు తండ్రీకొడుకులిద్దరు, మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి చంపారని పోలీసులు శనివారం తెలిపారు. హత్యకు గురైన గ్రామస్తులు నిద్రిస్తున్న సమయంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి, కత్తులతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. దాడి చేసిన ఉగ్రవాదులు చురచంద్‌పూర్‌ నుండి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొండలు, లోయల మధ్య, కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించబడుతున్న బఫర్‌జోన్‌ను ఉగ్రవాదులు ఉల్లంఘించి, దాడి చేశారని తెలిపారు. మరణించిన ముగ్గురూ రిలీఫ్‌ క్యాంపులో ఉండేవారు. పరిస్థితి మెరుగుపడిందని భావించి, శుక్రవారం తమ నివాసాలకు తిరిగి వచ్చారు. అంతలోనే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెప్పారు. హత్యలకు ప్రతీకారాంగా బిష్ణుపూర్‌ జిల్లా ఉఖా తంపక్‌లో కుకీలకు చెందిన ఇళ్లను ఒక మూక తగలబెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరో ఘటనలో రాష్ట్ర బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఇంఫాల్‌లోని రాజ్‌ మెడిసిటీకి చికిత్స నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్‌లోని నారన్సీనా ప్రాంతాలోని రెండో భారత రిజర్వు బెటాలియన్‌ (ఐఆర్‌బి) ప్రధాన కార్యాలయంలోని పోలీసు ఆయుధాగారంపై గురువారం రాత్రి దాడి చేసి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
కర్ఫ్యూ వేళల కుదింపు
తాజా ఘటనల నేపథ్యంలో ఇంఫాల్‌లోని రెండు జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 5 నుంచి 10.30 గంటల వరకు కుదించారు. గతంలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండేది.
ప్రభుత్వ సంస్థలు ఏమి చేస్తున్నాయి : ఐటీఎల్‌ఎఫ్‌
హింసను అరికట్టేందుకు ప్రభుత్వ సంస్థలు ఏమి చేస్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నామని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటిఎల్‌ఎఫ్‌) ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు నెలలుగా ప్రభుత్వం పంపించిన తుపాకులను, ఆయుధాలను దోచుకుంటున్నా, భద్రతాపరమైన ఉద్రిక్తతలకు పాల్పడుతున్నా ఎందుకు నివారించలేకపోతున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇంఫాల్‌ లోయ సహా పలు ప్రాంతాల్లో 24 గంటల సమ్మె
27 అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్‌ కమిటీ 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో, ఇంఫాల్‌ లోయసహా దాదాపు అన్ని ప్రాంతాల్లో శనివారం దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేశారు.