మణిపూర్‌లో మళ్లీ హింస

Violence again in Manipur– ఇంఫాల్‌లో రెండు ఇండ్లకు నిప్పు
– పారిపోయిన నిందితులు.. మంటలు ఆర్పేసిన ఫైర్‌ సిబ్బంది
– పలు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
– ఘటన జరిగిన ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు, నిరసనల సెగలు ఇంకా చల్లారటం లేదు. ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో హింస చెలరేగింది. ఆందోళనకారులు రెండు ఇండ్లకు నిప్పు పెట్టారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావ టానికి పోలీసులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. బుధవారం రాత్రి పది గంటల సమయంలో పటోసి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారి పోయారనీ, ఇండ్లకు నిప్పు పెట్టటంతో ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతా వరణం చోటు చేసుకున్నదని చెప్పారు. భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ ఘటన అనంతరం మెయిటీ తెగకు చెందిన మహిళ గ్రూపు ఆ ప్రాంతంలో గుమికూడటంతో భద్రతా బలగాలు వారిని నిరోధించా యని పోలీసు అధికారులు తెలిపారు. ఆందోళనకర ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామనీ, అదనపు భద్రతా సిబ్బందిని మోహరించామని వివరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులో ఉన్నదన్నారు. ఈ ఏడాది మే 3 నుంచి మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య కొనసాగుతున్న జాతి హింస కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అలాగే, వందల సంఖ్యలో ఆందోళనకారులు, ప్రజలు గాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రంలో రెండు చోట్లా అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాలు మాత్రం ఇక్కడి అల్లర్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయని అక్కడి పౌరులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.