అనుభవం లేని డ్రైవర్లతో వీఐపీలు చనిపోతున్నారు

అనుభవం లేని డ్రైవర్లతో వీఐపీలు చనిపోతున్నారు– డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తాం
– ఇష్టాగోష్టిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అనుభవం లేని డ్రైవర్లతో ఇటీవల వీఐపీలు చనిపోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల డ్రైవర్లకు డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహిస్తామన్నారు. అన్నిరకాల పరీక్షలు పాసైతేనే వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌లో విలేకర్లతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. డ్రైవర్లకు డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహిం చాలని కోరుతూ వీఐపీలకు లేఖలు రాస్తామన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లనే నియమించుకోవాలని సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీ కోసం ఆరు వేల కోట్ల అప్పులు చేసిందన్నారు.
మహాలక్ష్మి ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళలు రాష్ట్రంలో అన్ని దేవాలయా లకు వెళ్తున్నారనీ, దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని చెప్పారు. ఆ పథకం మొదలైన తర్వాత రోజుకు 50 లక్షల మంది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కూడా లాభాల బాట పడుతున్నదని చెప్పారు. ఇప్పటికే కొత్త బస్సులను కొనుగోలు చేశామన్నారు. మేడారం జాతరకు రవాణా శాఖ కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారని వివరించారు. త్వరలోనే ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామన్న హామీని అమలు చేస్తామన్నారు. కులగణన విషయంలో ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందనీ, బీహార్‌ తరహాలో దాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇండ్ల సమస్యపై త్వరలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. లిక్కర్‌ కేసులో కవితకు నోటీసులు ఇవ్వడం ఎన్నికల స్టంట్‌ అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్గో టార్గెట్‌ రెండువేల వేల కోట్లుగా ఉంటే… ఇప్పటికి రూ.150 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు.