– హక్కుల కోసం తెలుగువారమంతా ఏకమవుదాం: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
విశాఖ : ఢిల్లీ నుంచి సుల్తాన్‌లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ”విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారు. ఉక్కు సంకల్పంతో సభ పెట్టారు. వైఎస్‌ఆర్ సంకల్పాన్ని నిలబెట్టే వారే ఆయన వారసులవుతారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోడీ ఏపీని పట్టించుకోవడం లేదు. ఢిల్లీని డిమాండ్ చేసి.. కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదు. అందుకే పదేండ్లయినా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు.. పోలవరం పూర్తి కాలేదు.
ప్రశ్నించే గొంతుకలు కావాలి.. అని అన్నారు. బీజేపీ అంటే.. బాబు, జగన్, పవన్. ఇదే మోడీ బలగం. ఎవరు గెలిచినా ఆయనకు మద్దతిచ్చే వారే. ఈ ప్రాంత సమస్యలపై నిటారుగా కొట్లాడే నాయకులు కావాలి. ఏపీ ప్రజలకు కావాల్సింది పాలకులు కాదు.. ప్రశ్నించే గొంతుకలు.
తెలుగువారి హక్కులు కాపాడుకొనేందుకు అంతా ఏకమవుదాం. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని షర్మిల ఇక్కడకు వచ్చారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే ఊరుకోమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పోరాటం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. అయినా.. ఏపీ ప్రజల తరఫున నిలబడే నాయకురాలు షర్మిల. 25 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాల్లో గెలిపించండి.. చట్ట సభల్లో మీ కోసం పోరాటం చేస్తారు.ఇక్కడ కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోంది. షర్మిల నాయకత్వాన్ని బలపరచండి.. అండగా నేనుంటా. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు.