విశాఖ ఉక్కు ఇక రెండేళ్లే!

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వివాదాస్పద రాతలు
విశాఖ : రాష్ట్ర ప్రజానీకం ప్రతిష్టాత్మకంగా భావించే విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఒకరు డెడ్‌లైన్‌ రాశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేంకగా సంవత్సరాల తరబడి ప్రజానీకం చేస్తున్న పోరాటాన్ని అవహేళన చేసేలా ‘అక్షరాల’ వ్యవహరించారు. ఈ విషయం తెలిసిన ఉక్కు పరిశ్రమ కార్మికలోకం భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ని రసిస్తూ అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్దకు దూసుకురావడానికి కార్మికులు ప్రయత్నించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్‌ సిన్హా మంగళవారం నాడు విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఎప్పటికప్పుడు అధికోత్పత్తి సాధిస్తున్న కార్మికలోకాన్ని అభినందించాల్సిన ఆయన ఆ పని చేయకపోగా సందర్శకుల పుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. ఉత్పత్తి లక్ష్యాలను కార్మికులు ఎప్పటికప్పుడు అధిగమిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తుంటే సందర్శకుల పుస్తకంలో ‘ రెండు సంవత్సరాల తరువాత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పాదకత ఉండదు’ అని రాశారు. అంతటితో ఆగక ‘ ప్లాంటు జీవిత కాలం రెండేళ్లే ‘ అని కూడా లిఖించారు. కేంద్ర ప్రభుత్వ ఉక్కు కార్యదర్శి రాసిన ఈ రాతలను చూసి అధికార యంత్రాంగం సైతం దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. అడ్మిన్‌ భవనం ముట్టడికి సిద్ధమయ్యారు. నినాదాలు, నిరసనలతో చాలాసేపు ఆ ప్రాంగణం హోరెత్తింది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 922 రోజుల నుంచి తామంతా పోరాడుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చిన కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇక్కడి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వంతో చెప్పాల్సిపోయి సందర్శకుల పుస్తకంలో ఈ విధంగా రాయడం తగదంటూ కార్మికులు ఆగ్రహించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అడ్మిన్‌ బిల్డింగ్‌లోకి దూసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులకూ, పోలీసులకూ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామంటూ కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శిస్తారని తెలిసి కార్మికులు, ఎల్‌ఎంఎం, ఎస్‌బిఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు మంగళవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ఆందోళనలో భాగస్వాములయ్యారు.
ప్లాంట్‌ ప్రయివేటీకరణ తగదు : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
అంతకుముందు సిన్హాతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సమావేశమయ్యారు. ప్లాంట్‌ ప్రయివేటీకరణ తగదని అన్నారు. జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ 2030 నాటికి 300 మిలియన్‌ టన్నులు కావాలని కేంద్రం తన డిపిఆర్‌లో రాసుకుందని, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తే ఎక్కడ నుంచి స్టీల్‌ తెస్తుందని ప్రశ్నించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం 102 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అవుతోందని, ఇంకా దేశ అవసరాలకు మరిన్ని మిలియన్‌ టన్నులు అవసరమని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లో మూడో ఫర్నేస్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తే ప్లాంట్‌ వేల కోట్ల రూపాయల లాభాల్లోకి తెస్తామని అన్నారు.