విశ్వ గురువు ఏడి?

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశమంతా రామ మందిర మానియాలో మునిగిపోయింది. బాబ్రీ మసీదును కూల్చివేసి, ఆ ప్రదేశంలో నిర్మించిన రామాలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడం మున్నెన్నడూ కానరాలేదు. ప్రింట్‌ మీడియా, టీవీ ఛానల్స్‌, సామాజిక మాధ్యమాలు…ఒకటేమిటి? అన్ని ప్రచార సాధనాలూ ఈ వేడుకకు విశేష ప్రచారం కల్పించాయి. అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ‘విశ్వగురువు’గా వందిమాగధులు పిలిచే ప్రధాని నరేంద్ర మోడీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి అని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రధాని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్య వైభవమే!
విశ్వ గురువు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణాన్ని దేశ ప్రజలు గతంలోనూ చూశారు. గత సంవత్సరం జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా కానీ, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో కానీ అది మనకు కన్పించింది. గతంలోనూ మనం అనేక మంది విశ్వ గురువులను చూశాము. కానీ వెరెవ్వరికీ ఈ తరహా కీర్తికండూతి లేదు. గౌతమ బుద్ధుడు, అశోక చక్రవరి, అక్బర్‌ వంటి వారు తమ ప్రజానుకూల చర్యల ద్వారా విశ్వ గురువులుగా కీర్తి గడించారు. ఆధునిక కాలంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా 1950, 1960 దశకాలలో ప్రపంచ నేతగా పేరు పొందారు. అణు యుద్ధం, విధ్వంసం, రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం వంటి పరిణామాలతో అసాధారణ వినాశనానికి లోనైన ప్రపంచంలో ఆయన అలీనోద్యమాన్ని వ్యాప్తి చేశారు. యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా ఈజిప్ట్‌, యుగోస్లోవేకియా, ఘనా, ఇండొనేషియా వంటి దేశాల అధినేతలతో జట్టు కట్టారు. అయితే ఈ రోజు మనం చూస్తున్నదేమిటి ? గాజాలో నరమేథం సాగుతుంటే దానికి కారణమైన, దానిని ప్రోత్సహిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన మన విశ్వ గురువు ఆ విషయాన్ని ఎంత మాత్రం పట్టించుకోకుండా లక్షదీవుల్లో సేద తీరారు. ఆయన మద్దతుదారులు మాల్దీవులపై విషం చిమ్మారు. వాస్తవానికి మాల్దీవులు మన దేశంలోని చిన్న రాష్ట్రాల కంటే చాలా చిన్నది. ఇక్కడ మనం దక్షిణాసియా నేత నెల్సన్‌ మండేలాను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దోషిగా నిలిపారు. తద్వారా మండేలా విశ్వ గురువు అయ్యారు. మన విశ్వ గురువు క్యాబినెట్‌ సహచరులు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలు మాత్రం కార్పొరేట్‌ వ్యాపార సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి హాజరయ్యారు.
అలీనోద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 120 దేశాల ప్రతినిధులు ఉగాండాలోని కంపాలాలో సమావేశమై గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలంటూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. విశ్వ గురువుగా చెప్పుకుంటున్న నాయకుడి ప్రాధాన్యతల జాబితాలో ఈ అంశమే లేదు. సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య చెలరేగిన ఘర్షణను నివారించేందుకు చైనా గతంలో నాయకత్వ పాత్ర స్వీకరిస్తే మనం మాత్రం ఇప్పుడు అలాంటి పనిని చేయలేకపోయాం. ఈ పరిణామాలను గమనిస్తే మన దేశంలో ఈ రోజు నిజమైన విశ్వ గురువు లేడని అనిపిస్తోంది కదూ!